తెలంగాణ కళాకారుడు దర్శనం మొగులయ్య ఇక నుంచి పద్మశ్రీ మొగులయ్య. ఈ కిన్నెర కళాకారుడికి దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒక్కటైన పద్మశ్రీ వరించింది. 12 మెట్ల కిన్నెరను తన జీవితమంతా వాయిస్తూ వస్తున్నా.. 52 దేశాల ప్రతినిధుల ముందు ప్రదర్శనలు ఇచ్చినా రాని గుర్తింపు.. ఒకే ఒక్క పాటతో వచ్చింది. పవన్ కల్యాణ్ మూవీ భీమ్లా నాయక్‌లో టైటింగ్ సాంగ్‌ను తనదైన స్టయిల్లో పాడారు. ఓవర్‌నైట్ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. “సెభాష్.. ఆడాగాదు.. ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు.. గుర్రం నీళ్లా గుట్టా కాదు.. బెమ్మాజెముడు చెట్టున్నాది” అంటూ సెన్షేషనల్ సాంగ్ పాడి మొగులయ్య అందరికీ సుపరిచితులయ్యారు. మొగులయ్యను ఇప్పుడు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించడం విశేషం.
మొగులయ్య నాగర్‌కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకుల గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీ మురికివాడలో కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు. ప్రస్తుతం మొగులయ్య వయసు 68 ఏళ్లు. 500 ఏళ్ల చరిత్ర ఉన్న 12 మెట్ల కిన్నెర వాయిద్యం వాయిస్తూ తెలంగాణ వీరగాథలు తన వాద్యంతో వినసొంపైన హావభావ సహితంగా వినిపిస్తాడు.
వెదురు, గుండ్రటి సొరకాయలు, తేనె, మైనం, తీగలు, ఎద్దుకొమ్ములు, అద్దాలతో ఈ కిన్నెర వాద్యాన్ని తయారు చేస్తాడు. ఈ కళపై ఓ ఔత్సాహికుడు పీహెచ్డీ చేసి ప్రపంచానికి పరిచయం చేశాడు. మొగులయ్య జీవిత చరిత్ర ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా ఉంది.
అత్యంత పేద కళాకారుడు దర్శనం మొగులయ్య. కడుపునిండా తిండిలేక మొగులయ్య భార్య శంకరమ్మ అనారోగ్యంతో మంచాన పడితే.. ఆసుపత్రిలో వైద్యం చేయించేందుకు వెయ్యి రూపాయలు లేక పరిస్థితి విషమించి ఆమె చనిపోయింది. ‘కిన్నెర కన్నీరు’ పేరుతో వచ్చిన కథనాన్ని పత్రికలో చూసి చలించిపోయిన సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళీ మొగులయ్యకు 25 వేల ఆర్థికసాయం అందించాడు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక.. కేసీఆర్ ప్రభుత్వం దర్శనం మొగులయ్యకు పలు విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది. ప్రతి నెల రూ.10 వేలు పింఛను అందజేస్తుంది. పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయనతో ప్రదర్శలు ఇప్పిస్తోంది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దర్శనం మొగులయ్య కిన్నెర కళాకారుని ప్రతిభను గుర్తించింది. ఆ కళారూపాన్ని డాక్యూమెంటరీ చేశారు.
ఇక భీమ్లా నాయక్ మూవీతో మొగులయ్య జీవితమే మారిపోయింది. కేవలం సినిమా అవకాశమే కాదు, వ్యక్తిగతంగా 2 లక్షల నగదు కూడా ఇచ్చారు పవన్‌కల్యాణ్. తెలుగువారందరూ గుర్తుపట్టేలా పాపులారిటీ తెచ్చిపెట్టారు. ఇప్పుడు ఏకంగా పద్మశ్రీ అవార్డు వచ్చేందుకు పరోక్షంగా కారణమయ్యారు జనసేనాని.