ఏపీలో కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లాల పేర్లలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు అనుగుణంగా ప్రతి జిల్లాకు వేర్వేరుగా ముసాయిదా ప్రకటన జారీ చేసింది. 26 జిల్లాలకు సంబంధించి వరుసగా గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ ప్రతిపాదనలపై స్థానికులకు ఏవైనా అభ్యంతరాలుంటే నెల రోజుల్లోగా సంబంధిత జిల్లా కలెక్టర్కు తెలియజేయాలని ప్రభుత్వం పేర్కొంది. మంగళవారం రాత్రి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెమొరాండానికి, గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న దానికి మధ్య స్వల్ప తేడాలున్నాయి.
మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమొరాండంలో తూర్పు గోదావరి జిల్లాకు కాకినాడ, రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు రాజమహేంద్రవరం జిల్లాగా, పశ్చిమ గోదావరి జిల్లాకు ఏలూరు, నరసాపురం జిల్లాకు భీమవరాన్ని జిల్లా కేంద్రంగా పేర్కొన్నారు. గెజిట్ నోటిఫికేషన్లో మాత్రం కాకినాడ కేంద్రంగా కాకినాడ జిల్లా, రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు జిల్లాకు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాకు భీమవరం కేంద్రంగా పేర్కొన్నారు.
రాజమహేంద్రవరం, భీమవరం కేంద్రాలుగా ఏర్పాటయ్యే జిల్లాలలో అధిక భాగం గోదావరీ పరీవాహక ప్రాంతం కావడంతో ఆయా జిల్లాలకు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలుగా నామకరణం చేస్తే బాగుంటుందని కొందరు మంత్రులు సూచించారట. దీంతో మంగళవారం రాత్రి నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఈ మార్పులు చేసినట్టు తెలుస్తోంది.
కందుకూరు పోయి పొదిలి వచ్చింది..
ప్రకాశం జిల్లాలో కొత్తగా కనిగిరి రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేస్తున్నట్టు మెమొరాండంలో పేర్కొనగా గెజిట్ నోటిఫికేషన్లో ఆ పేరు ఎగిరిపోయింది. దాని స్థానంలో కొత్తగా పొదిలి రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటయ్యే శ్రీ సత్యసాయి జిల్లాలో పెనుకొండ, పుట్టపర్తి, కదిరి రెవెన్యూ డివిజన్లు ఉంటాయని మెమొరాండంలో పేర్కొనగా గెజిట్లో మాత్రం పెనుకొండ, పుట్టపర్తితోపాటు ధర్మవరం రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ మార్పులతోపాటు కొన్ని అక్షర దోషాలను కూడా ప్రభుత్వం సరిచేసింది.
కడప పేరు కనుమరుగు..
తిరుపతి అర్బన్ జిల్లా విషయంలో ఇంగ్లిష్లో టీహెచ్ఐ (THI) అని తొలుత పేర్కొనగా, ఇప్పుడు దానిని టీఐ (TI)గా మార్చారు. అర్థంలో ఎలాంటి మార్పు లేకున్నా స్థానికంగా వినియోగించే దానినే ప్రాతిపదికగా తీసుకున్నారు. అలాగ ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా అని తొలుత పేర్కొనగా, ఇప్పడు దాన్ని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాగా సవరించారు. వైఎస్సార్ కడప పేరును వైఎస్సార్ జిల్లాగా, మండలం పేరును బీఎన్ కండ్రిగకు బదులుగా బుచ్చినాయుడు కండ్రిగగా గెజిట్ నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది.
కొత్త ముసాయిదా ప్రకారం ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడప పూర్తిగా కనుమరుగు కాబోతోంది. ఈ జిల్లాను రెండు ముక్కలు చేయబోతున్నారు. అన్నమయ్య జిల్లా పేరుతో రాయచోటి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కాబోతోంది. రెండో జిల్లాకు వైయస్సార్ జిల్లాగా నామకరణం చేయనున్నారు. ఇది గతంలోకడపగా, ప్రస్తుతం వైయస్సార్ కడపగా ఈ జిల్లా ఉంది. కొత్త జిల్లాలు వస్తే… కడప అనే పేరు పూర్తిగా ఉనికిని కోల్పోబోతోంది. దీనిపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప అంటే తిరుమలకు తొలి గడపగా శ్రీవేంకటేశ్వస్వామి భక్తులు భావిస్తుంటారు. అలాంటి కడప కనుమరుగు కానుండటం పట్ల కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.