ఏదైనా ఓ అంశం వివాదాస్పదమైనప్పుడు దాన్ని తాత్కాలికంగా నిలిపేయాలి. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఇరువురి ఒడంబడికతో దాన్ని అమలు చేయాలి. ఎక్కడైనా చర్చలకు ఇవే ప్రాతిపదికగా ఉంటాయి. దీనికి భిన్నంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు రావాలని ఆహ్వానిస్తున్నారు. మరోవైపు వివాదాస్పదమైన పీఆర్సీ జీవోను వెనక్కి తీసుకోరు. కనీసం ఈనెలకు పాత జీతాలు ఇవ్వండి. అప్పుడు చర్చిద్దామని ఉద్యోగ సంఘాల నేతలు అడుగుతున్నారు. దీన్ని కూడా తోసిరాజని కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు ఇచ్చేందుకు ప్రాసెస్ చేయాలని ట్రెజరీ, పేఅండ్ అకౌంట్స్ సిబ్బందిపై ఒత్తిడి చేస్తుంటే.. ఇక చర్చలకు చోటేది మహాశయా !
ఉద్యోగులపై ముప్పేట దాడి చేస్తూ చర్చలకు పిలవడం అర్థరహితం. ఇది సమస్యను మరింత జఠిలంగా మారుస్తుంది. ప్రభుత్వం భేషజాలకు పోతున్నట్లు కనిపిస్తోంది. పది పీఆర్సీలను చూసిన ఉద్యోగ సంఘాల నేతలకు పరిపక్వత లేదంటున్నారు.
అందుకే పాపం.. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తామంటున్నది ఏ పీఆర్సీనో అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు. ఇది అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిందా.. సీఎస్ కమిటీ సిఫారసు చేసిందా.. లేక కేంద్ర పీఆర్సీనో చెప్పాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారంటే.. ఉద్యోగులను ఇంతగా గందరగోళంలోకి నెట్టిన పీఆర్సీ ఇదేనేమో.
ప్రభుత్వ ఉద్యోగులు మావాళ్లు. వాళ్లకు ఎంత చేయడానికైనా వెనుకాడబోమని సీఎం జగన్ ఉద్ఘాటిస్తున్నారు. కనీసం దాన్ని ఆచరణలో పెట్టాలి. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరింత చొరవ తీసుకోవాలి. కొత్త పీఆర్సీ జీవోను తాత్కాలికంగా నిలిపేసి ఉద్యోగ సంఘాలతో చర్చించాలి. ప్రస్తుతం ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి ఉద్యోగులూ సమస్య కాకుండా చూడాలి. ఉద్యోగులను ప్రజల్లో పలుచన చేసే ప్రచారానికి స్వస్తి చెప్పాలి. సీఎం నియమించిన కమిటీ ఆ దిశగా ఆలోచించి అడుగు ముందుకెయ్యాలి.