విద్యుత్ సంస్కరణలను తు చా తప్పకుండా అమలు చేస్తున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రుణాలు మంజూరు చేసింది. ఏపీకి రూ.2,123 కోట్లు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల్లో ఒక్కదానికీ ఈ సొమ్ము సరిపోదు. అదే కేంద్రం రూపొందించిన విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే నష్టపోయేది కొన్ని వందల రెట్లు ఎక్కువ. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షులాగా నెట్టుకొస్తున్న రాష్ట్ర సర్కారు కొద్దిపాటి రుణం కోసం అత్యంత ప్రమాదకరమైన విద్యుత్ సంస్కరణలను భుజానికెత్తుకుంది. దీని పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయంటే..
ప్రస్తుతం నష్టాల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్ పంపిణీ సంస్థలను ఉన్నవి ఉన్నట్టుగా ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలి. అలా ఇచ్చేయాలంటే ప్రభుత్వం వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీ విద్యుత్‌కు మంగళం పాడాలి. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తొలి అడుగు ముందుకేసింది. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు ఏర్పాటు చేస్తోంది. ఇక నుంచి వ్యవసాయానికి వినియోగించే విద్యుత్ చార్జీలను ప్రభుత్వం రైతుల ఖాతాకు జమ చేస్తుంది. రైతులే కరెంటు బిల్లులు కట్టుకోవాలి. ఏటా సుమారు రూ. 10 వేల కోట్ల భారాన్ని ప్రభుత్వం మోయాల్సి ఉంటుంది. ఆ సొమ్మును ప్రజలపై వివిధ పన్నులు లేదా భారాల రూపంలో వసూలు చేయాల్సి వస్తుంది.
ఈపాటికే 50 యూనిట్ల లోపు పేద ఎస్సీఎస్టీలకు ఉచితంగా ఇస్తున్న కరెంటును 30 యూనిట్లకు కుదించారు. త్వరలో దీన్ని కూడా ఎత్తివేసే అవకాశముంది. ఇంకా మంగలి షాపులు, రజకుల దోభీఘాట్లు, చిన్నతరహా పరిశ్రమలకు ఇస్తున్న రాయితీలకూ కోత పడుతుంది. మొత్తంగా ఏ వర్గానికీ రాయితీ కరెంటు సరఫరా ఉండబోదు. ప్రైవేటు ఆపరేటర్లు నిర్ణయించిన యూనిట్ ధర ప్రకారం చెల్లించాల్సిందే.
ఇప్పటిదాకా ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు వేల కోట్ల ఆస్తులను కూడబెట్టాయి. ప్రభుత్వాల అనాలోచిత విధి విధానాల వల్ల అవి అప్పుల్లో కూరుకుపోయాయి. ఇప్పుడు వాటిని ఉన్నవి ఉన్నట్లుగా ప్రైవేటు ఆపరేటర్లకు ఇచ్చేయాలి. వాటి రుణాలను మాత్రం ప్రభుత్వం చెల్లించాలి. ప్రైవేటు ఆపరేటర్లు ఇచ్చే లీజు సొమ్ముతో అప్పులు తీర్చాలి. ఈ పద్ధతిని అభివృద్ధికి దోహదపడే సంస్కరణలంటారో.. ప్రజల ఆస్తులను అప్పనంగా కాజేసే నిలువు దోపిడీ అంటారో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి.
కేంద్ర సంస్కరణల ప్రకారం విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి బడా వినియోగదారులు డిస్కంలకు సంబంధం లేకుండా నేరుగా హెచ్ టీ లైన్ల ద్వారా కరెంటు తీసుకోవచ్చు. ఇది డిస్కంల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. దీనివల్ల డొమెస్టిక్ వినియోగదారులకు నాణ్యమైన కరెంటు సరఫరా కష్టమవుతుంది. సంస్కరణల్లో భాగంగానే రాష్ట్ర సర్కారు విద్యుత్ ఉత్పత్తి సంస్థలనూప్రైవేటుకు కట్టబెడుతోంది. ఈ వినాశకర సంస్కరణలకు తలొగ్గితే జరిగే నష్టమెంత.. కేంద్రం ఇచ్చే రుణమెంతనేది ఏపీ ప్రభుత్వం బేరీజు వేసుకోవాలి. పొరుగునున్న తెలంగాణ కేంద్ర సంస్కరణలను నిర్ద్వందంగా తిరస్కరించింది. ఈపాటికే ప్రైవేటు ఆపరేటర్లతో విద్యుత్ సరఫరా నడుస్తున్న ఢిల్లీ ప్రజల చేదు అనుభవాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి.