ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మంకగా మారాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్నాయి. ప్రధాన పార్టీలు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై వెలువడిన ఒపీనియన్ పోల్స్ సర్వేలో సంచలన ఫలితాలు వచ్చాయి. సర్వేను తాము ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించినట్లు అవుట్ ఆఫ్ ది బాక్స్ చెప్పుకుంది. క్షేత్రస్థాయి నుంచి వివిధ మార్గాల్లో సేకరించిన ఆయా రాష్ట్రాల ప్రజల అభిప్రాయాలను క్షుణ్ణంగా క్రోడీకరించి సర్వే ఫలితాలు ఇచ్చినట్లు వెల్లడించింది.
అవుట్ ఆఫ్ ది బాక్స్ సంస్థ తాజాగా ఐదు రాష్ట్రాల్లో నిర్వహించిన ‘ఒపీనియన్ పోల్స్ 2022’లో ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాధ్ సారథ్యంలోని బీజేపీనే మళ్లీ అధికార పగ్గాలు అందుకోబోతున్నట్లు తేలింది. మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను బీజేపీ 252 నుంచి 272 స్థానాల్లో జయకేతనం ఎగరేసే అవకాశాలున్నాయని తెలిపింది.
అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీకి 111 నుంచి 131 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని సర్వే పేర్కొంది. బీఎస్పీకి 8 నుంచి 16 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి కేవలం 3 నుంచి 9 స్థానాలకే పరిమితం కానుందట. యూపీలో మిగతా పార్టీలు సోదిలో మిగిలే ఛాన్స్ లేదని అవుట్ ఆఫ్ ది బాక్స్ తాజా ఓపీనియన్ పోల్ చెబుతోంది. ఒకప్పుడు యూపీని ఏకఛత్రంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యే దుస్థితికి దిగజారినట్లు పోల్ సర్వే తేల్చింది.
ఉత్తరాఖండ్ లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను 36 నుంచి 42 చోట్ల బీజేపీ గెలిచే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీని 25 నుంచి 31 సీట్లలో ఓటర్లు గెలిపించే అవకాశం ఉందట. బీజేపీకి పోటీ ఇచ్చినా మేజిక్ ఫిగర్ చేరుకుంటుందో లేదో అని ఒపీనియన్ పోల్ వెల్లడించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ పార్టీకి ఉత్తరాఖండ్ లో సున్నా నుంచి 2 సీట్లు రావచ్చట. ఇతరులు 1 నుంచి 3 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. గోవాలో మొత్తం 40 స్థానాలకు గాను 16 నుంచి 20 మంది బీజేపీ అభ్యర్థులకు విజయావకాశాలున్నాయి.
గోవాలో ఆప్ పార్టీకి ఆశాజనకమైన ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందట. ఆప్ కి ఇక్కడ 4 నుంచి 28 అసెంబ్లీ సీట్లలో గెలుపు ఛాన్స్‌లు ఉన్నాయని ఒపీనియన్ పోల్ తేల్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా కాస్త ఉనికి చూపించుకుని 9 నుంచి13 చోట్ల అభ్యర్థులను అసెంబ్లీకి పంపించే అవకాశాలున్నాయని తెలిపింది. గోవాలో బరిలో దిగిన తృణమూల్ కాంగ్రెస్ 1 నుంచి 5 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉన్నట్లు పోల్ చెబుతోంది.
ఇప్పటి వరకు పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం విజయానికి అటూ ఇటూగా స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. పంజాబ్ లో ఆప్ పార్టీ బాగా పుంజుకుని రాష్ట్ర పగ్గాలు చేపట్టే దిశగా సాగుతోందని ఒపీనియన్ పోల్ చెబుతోంది. ఇక్కడ ఆప్ పార్టీ 50 నుంచి 60 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందట. ఒపీనియన్ పోల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ 42 నుంచి 48 సీట్లలో గెలుస్తుందట. శిరోమణి అకాలీదళ్ 13 నుంచి 17 చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నాయి. బీజేపీని మాత్రం సింగిల్ డిజిట్ అంటే 1 నుంచి 3 స్థానాలకే ఓటర్లు పరిమితం చేస్తారని ఒపీనియన్ పోల్ సర్వే వెల్లడించింది.
మణిపూర్ లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గాను 31 నుంచి 37 చోట్ల బీజేపీ గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు 13 నుంచి 19 స్థానాలు రావచ్చట. ఎన్ పీపీకి 3 నుంచి 9, ఎన్ పీఎఫ్ 1 నుంచి 5 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని అవుట్ ఆఫ్ ది బాక్స్ నిర్వహించిన తాజా పోల్ సర్వే వివరిస్తోంది.