మనిషి ప్రవృత్తి ఎలాంటిది ? ముందు కనీస అవసరాలు తీరితే అదే పదివేలనుకోవడం! ఇప్పుడు ‘పదివేల ₹’ కాలం కాదనుకోండి. అంతా లక్షలు.. కోట్ల వ్యవహారాలు కదా! పదివేలనేది అర్థ శతాబ్దం క్రితం మాట. అప్పుడది ‘పేద్ద’ అమౌంట్ కింద లెక్క! పెద్దపెద్ద చదువులు.. అంతకంటే పెద్దపెద్ద ఉద్యోగాలు. అందులో చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగాలు. వాటి గురించి ప్రయత్నాలు. అదంతా అతి పెద్ద విద్యా మార్కెట్. విద్యా వ్యాపారి ఒకరు ఎదిగీ ఎదిగీ ఓ రాష్ట్రానికి మంత్రి కూడా అవడం మనం చూశాం. అంత ‘పేద్ద’ మార్కెట్ అయిందది. పోటీలు.. పోల్చుకోవడాలు.. బాధ పడటాలు వగైరా ఆ విపరీత మార్కెట్ కు కారణం.
కనీస అవసరాలు తీరగానే.. అంటే కూడు గుడ్డ వగైరా- అవి తీరగానే సకల సౌకర్యాలు కావాలనుకుకోవడం.. వాటిని కూడా సమకూర్చుకోవడం. వెహికిల్, కూలర్, ఏసీ, చిన్న ఇల్లు సరిపోదు. ‘పేద్ద’ ఇల్లు.. అదీ గేటెడ్ కమ్యూనిటీ ఇల్లు కావాలి. ఊరు చుట్టుపక్కల ఇళ్ల స్థలాలు కొని పడెయ్యాలి. బంగారం వెండి డబ్బు బీరువాల్లో మూలగాలి. పిల్లలు అమెరికా వెళ్లాలి. చాలా చాలా సేఫ్ సైడ్ లో ఉండాలి. తామే కాదు. తమ తరతరాల వారు కూడా సేఫ్ సైడ్ లో ఉండాలి. ప్రపంచం గంగలో పోనీ !
అటువంటి వారిలో మొన్న ఓ ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఏమిటంటే.. తనను ఒకచోట నుంచి మరోచోటకు ట్రాన్సఫర్ చెయ్యడమట. ట్రాన్సఫర్ చేస్తే కూడా ఆత్మహత్య చేసుకుంటారా? పైగా ప్రభుత్వ టీచర్. జీవితం పట్ల ఓ అవగాహన ఉంటుంది కదా. విద్యార్థులకు చెప్పవలసిన వాడు కదా. అలా చేస్తే ఎలా? అదే తీవ్రమైన కారణమైతే అందుకు వారి సంఘాలున్నాయి. అవి వాటి ప్రయత్నాలు చేస్తున్నాయి. వేచి చూడాలి. వాళ్లతో కలిసి పోరాడాలి. ఆ మాత్రం దానికి ఆత్మహత్య చేసుకుంటారా?
నిశ్చితమైన ప్రభుత్వ ఉద్యోగం దొరికినాయన సంగతి ఇలా ఉంటే.. మరో నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదనే కారణమట. అది రాకపోతే చావడమేనా? ఇక వేరే దారి లేదా? తల్లిదండ్రులు భార్యాబిడ్డలు గుర్తుకు రాలేదా? ఆ ప్రభుత్వ ఉద్యోగేమో తనను ఒకచోట నుంచి మరోచోటకు ట్రాన్సఫర్ చేస్తే భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ నిరుద్యోగేమో తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. దొరికిన అతనేమో అలా, అదే దొరకని ఇతనేమో ఇలా! ఇవి చాలా స్వల్ప కారణాలు.
నిన్న నేను హైదరాబాదు ఉప్పల్ రింగ్ రోడ్ మీద బస్టాప్ వద్ద నిలబడి ఉన్నా. ఓ యువకుడు వీపుకు ఓ బ్యాగ్ తగిలించుకొని ఉన్నాడు. చేతిలో ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. వాటి ధర కూడా ఓ కార్డు మీద పెద్దగా రాసి పెట్టుకున్నాడు. ఇక ఎవరూ బేరసారాలు చెయ్యకుండా. బస్సుల చుట్టూ తిరుగుతూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అమ్ముకుంటున్నాడు. అతని తీరు చూస్తే చదువుకున్న వాడిలాగే ఉన్నాడు.
నెత్తికి టోపీ, ముక్కుకు మూతికి మాస్కుతో అందంగా ఉన్నాడు. అతనితో మరో యువకుడు కామెడీ చేస్తూ సమోసాలు అమ్ముతున్నాడు. అటు గోడ పక్కన ఓ ముసలమ్మ కింద కూర్చుని జామపండ్లను అమ్ముకుంటోంది. వారి మొహాల్లో దీనత్వం లేదు. హుషారుగా ఉన్నారు. జేబులో నాలుగు రూపాయలుంటే.. సంపాదించుకుంటే.. హుషారుగా ఉంటుంది. లేకుంటే నిరాశ కమ్ముకుంటుంది.
మొన్ననే వరంగల్ వ్యవసాయ మార్కెట్లో కొందరు డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలు చేసిన వారు కూడా హమాలీ పనులు చేస్తున్నారని వార్త! పత్తి మిర్చి బస్తాలను లారీల్లో లోడ్ చేస్తున్నారు. బస్తాకు మూడు నుంచి ఐదు రూపాయలు వస్తాయట. వాళ్లు చెప్పింది ఏమిటంటే.. “ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాం. అప్పటి వరకు ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. ప్యాకెట్ మనీకి ఉపయోగపడతాయని హమాలీ పనులు కూడా చేస్తున్నాం” అని చెప్పారు. ఎంత స్ఫర్తిదాయకమైన యువకులు వారు! వాళ్లు చెప్పింది గానం చెయ్యని ఓ జీవన గీతం! ప్రతీ యువతీ యువకులు మనసులో మననం చేసుకోవాల్సిన గీతం! జీవితం ఒకటే. వైఖరులు అనేకం!
– తుమ్మేటి రఘోత్తమరెడ్డి