ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా మేడారం జాతరకు సర్వం సిద్దమైంది. ఫిబ్రవరి 16-19 వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. 16న సారక్క గద్దె మీదికి వస్తుండగా, 17న సమ్మక్కను తీసుకొస్తారు. 18న అమ్మవార్లు ప్రజలందరికీ దర్శనమిచ్చి 19న మళ్లీ వనాల బాట పడతారు. హైదరాబాద్ లాంటి మహా నగరవాసులు కూడా ప్రతి రెండేళ్లకోసారి మేడారానికి క్యూ కడతారు. మైదాన ప్రాంత, గిరిజనేతరులతో అటవీ ప్రాంతమంతా కిక్కిరిసిపోతుంది. జాతరకు 20 రోజుల ముందు నుంచే భక్తుల పుణ్యస్నానాలు, శివసత్తుల పూనకాలతో జంపన్నవాగు పునీతమవుతుంది. జాతర ముగిసేలోపు దాదాపు 3 కోట్ల మంది భక్తులు దర్శించుకుంటారు. జాతరకు తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఏర్పాట్ల కోసం రూ. 75 కోట్లు కేటాయించింది.
జనం ఎక్కడ చేరతారో అది ప్రముఖ వ్యాపార కేంద్రంగా మారడం సహజమే. దీన్నో అవకాశంగా తీసుకున్న వ్యాపార వర్గాలు అక్కడికి అన్ని రకాల వస్తువులు, తినుబండారాలు తరలించి రూపాయి పెట్టుబడికి 10 రెట్లు లాభాలు ఆర్జించేలా రేట్లు పెంచుతున్నారు. దీంతో ఖరీదైన భక్తుల సంగతి పక్కనపెట్టి.. కేవలం అమ్మవార్లను దర్శించుకొని వెళ్దాం అని వచ్చే సామాన్య భక్తులు, నిజాయతీగా మొక్కులు తీర్చుకుందామనుకునే పేదల చేతి చమురు విపరీతంగా వదులుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ఏ మొక్కులూ మొక్కుకోనివారు సైతం వ్యాపారస్తుల లాభాపేక్ష కారణంగా దేవతల ముందు నిలువు దోపిడీకి గురికావాల్సి వస్తోంది.
ధరల్ని అదుపు చేసే యంత్రాంగమేదీ !
ధరల్లో స్థానిక వ్యాపారులు ఒకరకంగా, స్థానికేతర వ్యాపారులు ఒకరకంగా రేట్లు ఫాలో అవుతున్నారు. బ్రాయిలర్ కోడి కిలో ప్రస్తుతం రూ. 180-200 నడుస్తోంది. అయితే ఇలాంటి అంశాల్లో స్థానిక వ్యాపారులు మార్కెట్ రేట్లు అనుసరిస్తుండగా స్థానికేతర వ్యాపారులు మాత్రం వీరు పెట్టిందే రేటు అమ్మిందే వస్తువు అన్నట్టుగా తయారైంది. ఇక నాటుకోడి విషయానికొస్తే కిలో రూ. 500 – 650 వరకు నడుస్తోంది. మద్యం రేట్లు ఆకాశానికంటాయి. ప్రతి క్వార్టర్ బాటిల్ మీద రూ. 50-80 కి పెంచి అమ్ముతున్నారు. బయట రూ. 300 ఉండే బ్లెండర్ స్ప్రైడ్ ఇక్కడ రూ. 380 అమ్ముతున్నారు. ఇక బీర్లయితే అక్షరాలా డబుల్ రేట్లకు అమ్ముతున్నారు.
పూజా సామగ్రి ధరలూ అధికమే..
గుడి ముందు వేలంపాటలో దుకాణాలు దక్కించుకున్నవారు పూజాసామగ్రి సెట్లను రూ. 150కి అమ్ముతున్నట్టు భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ ప్యాకేజీలో రెండు కొబ్బరికాయలు, రెండు బంగారం కడ్డీలు (చిన్నసైజు బెల్లం ముక్కలు), 4 అగరువత్తులు, పసుపు-కుంకు ప్యాకెట్లు 2 చిన్నవి. దాదాపు రూ. 60 విలువ చేసే ఈ వస్తువులకు రూ. 150 వసూలు చేస్తున్నారు. అయితే తాము రూ. 10 వేలు చెల్లించి వేలంలో షాపులు దక్కించుకున్నామని, అందువల్ల తాము కూడా ఎక్కడి నుంచో ఎన్నో కష్టనష్టాలకోర్చి వస్తున్నాం కాబట్టి ఎంతోకొంత లాభం చూసుకోవాల్సిందే కదా అని సర్ది చెబుతున్నారు. ఇక రోడ్ల వెంట పొలాల్లో షాపులు పెట్టుకున్నోళ్లూ అధిక ధరలతో బాదేస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకొని ధరలను అదుపు చేయాలని భక్తులు కోరుతున్నారు.