“మాకొచ్చే జీతాలను స్విస్ బ్యాంకుల్లో దాచుకోవడానిక్కాదు. ఆ డబ్బు తిరిగి జనంలోనే తిరుగుతుంది. నెలవారీ కిస్తీలు, ఇంటి అద్దెలు, ఇతర అవసరాలు తీర్చుకోవడానికే చాలడం లేదు. పీఆర్సీ ఫిట్మెంటుపై మళ్లీ ఎప్పుడో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. అప్పటిదాకా పాత జీతాలనే ఇమ్మంటే.. ప్రభుత్వం ఎందుకంత మొండి పట్టుదలకు పోతుందో ఏమో ! మాకు ఇచ్చేది కూడా నవరత్నాల తర్వాత ఉద్యోగ రత్నంగా భావించొచ్చు కదా !” అంటూ ఒంగోలుకు చెందిన ఓ నాలుగో తరగతి ఉద్యోగి వాపోయాడు. సీఎం జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చమని అడగడం నేరమా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
పీఆర్సీ ఫిట్ మెంటుపై ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య వివాదం కొత్త కాకపోవచ్చు. గతంలో ఒంటెద్దు పోకడతో వెళ్లిన ప్రభుత్వాలు దిగొచ్చాయి. ఉద్యోగులూ తాము కొన్ని డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గిన దాఖలాలున్నాయి. ప్రస్తుత పరిస్థితులు దీనికి భిన్నంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ సంఘాల్లో చీలికకు ప్రభుత్వం పన్నాగం పన్నినట్లు భావిస్తున్నారు. ఉద్యోగుల స్థయిర్యాన్ని దెబ్బతీసేందుకే కొత్త జిల్లాలను ఆఘమేఘాలపై తెరమీదకు తెచ్చినట్లు గుర్రుగా ఉన్నారు. నిజంగా ప్రభుత్వం చర్చల పట్ల సానుకూలంగా ఉంటే కొత్త పీఆర్సీ జీవోను వెనక్కి తీసుకోవాలి. అలాకాకుండా కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వడానికి అధికారులపై ఒత్తిడి చేస్తోంది. ఇక చర్చలకు అవకాశమెక్కడుందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఇది మా హక్కులపై దాడిగా భావిస్తున్నాం. అందుకే ఆరునూరైనా ఉద్యమ పథం నుంచి వెనక్కి తగ్గేదే లేదని ఉద్యోగ సంఘాలు భీష్మించాయి. ఆర్టీసీ ఉద్యోగుల కూడా సమ్మె బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఎవరు ఎక్కడకు బదిలీ అవుతారో తేల్చుకోమని అల్టిమేటం జారీ చేసింది. బదిలీ అప్షన్లు ఇవ్వాలని అధికారులు మార్గదర్శకాలు విడుదల చేశారు. దీంతోనైనా ఉద్యోగులు వెనక్కి తగ్గుతారని ప్రభుత్వ పెద్దలు భావించారు. కొత్త జిల్లాలతో స్థానభ్రంశం తప్పదన్నా కూడా ఉద్యోగులు తగ్గలేదు. సమ్మె చేసి ప్రభుత్వం మొండి వైఖరికి తగు విధంగా బుద్ది చెబుతామని హెచ్చరిస్తున్నారు.
ఆరోతేదీ అర్థరాత్రి వరకూ ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వం ఎస్మా ప్రయోగించవచ్చు. అరెస్టు చేసి జైలుకు పంపినా ఆశ్చర్చపోనక్కర్లేదు. ఇలాంటి బెదిరింపులు మాకు కొత్త కాదు. ఇంతకన్నా ఘోర ఆంక్షలను చవిచూసిన అనుభవం మాకుంది. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటాం. జైలుకు పోవడం మాకేమీ కొత్తకాదు. ఇలాంటి దుందుడుకు చర్యలతో ఉద్యమం మరింత బలపడుతుందని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు. ఈ వారం రోజుల్లోనైనా సమస్య పరిష్కారం కావాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఆ దిశగా పాలక పెద్దలు ఆలోచిస్తారా..