చర్చల పేరుతో ప్రభుత్వం ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తోంది. ఇకపై ఏఏ అంశాలపై చర్చించదల్చుకున్నారో రాత పూర్వకంగా ఆహ్వానిస్తేనే వస్తామని పీఆర్సీ సాధన సమితి స్పష్టం చేసింది. ఫిబ్రవరి 3న యథావిధిగా చలో విజయవాడ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించింది. ఈరోజు మంత్రులతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వ పోకడలు చూస్తుంటే సమస్య మరింత జఠిలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
కొత్త పీఆర్సీ వల్ల ప్రభుత్వానికి రూ.10,600 కోట్ల భారం పడుతుందని చెబుతోంది. అదే సందర్భంలో తమకు పాత జీతాలే ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఎందుకు మొండిగా కొత్త జీతాలను ప్రాసెస్ చేయాలని ట్రెజరీ అధికారులపై ఒత్తిడి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుందని ఉద్యోగ సంఘాలు నిలదీస్తున్నాయి. అశుతోష్మిశ్రా నివేదికలో అసలు ఏముంది ? ఎందుకు ప్రభుత్వం కావాలని నివేదికను తొక్కి పెడుతుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు.
మరోవైపున ఉద్యోగుల నుంచి ఐఆర్ రికవరీ చేయడానికి వీల్లేదని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి విచారణను 23కు వాయిదా వేసింది. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఫిబ్రవరి 3న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిలిపేస్తూ ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. తాము అలా ఆదేశించడం కుదరదంటూ న్యాయస్థానం ప్రభుత్వ పిటిషన్ను కొట్టివేసింది. కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వడంతోపాటు ఉద్యోగుల ఆందోళనను అణచివేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పరిస్ధితులు ఎక్కడకు దారితీస్తాయోనని ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.