జిల్లాల విభజన అంశం వైసీపీలో కలకలం రేపుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై కొందరు అధికార పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. స్థానికంగా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వైసీపీ నేతలకే కాదు.. సీఎం జగన్ మోహన్ రెడ్డికీ జిల్లాల విభజన సెగ తగులుతోంది. తన సొంత జిల్లా కడపలోనే జగన్ కు తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. అది ఎంతవరకు వచ్చిందంటే ‘నీకో దండం జగన్’అంటూ గ్రామాల్లో పోస్టర్లు వేసే వరకు వచ్చింది.
జిల్లాల పునర్విభజనలో భాగంగా ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాలను దగ్గర్లో ఉన్న జిల్లాల్లో కాకుండా దూరంగా ఉన్న జిల్లాల్లో కలపడంతో అక్కడ ప్రజలతో పాటు సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సుధీర్ఘకాలంగా ప్రత్యేక మదనపల్లి జిల్లా కోసం డిమాండ్లున్నాయి. అలాంటిది మదనపల్లి కాకుండా రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేశారు. వాస్తవంగా చూస్తే రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంగా ఉంది. రాజంపేటతో సంబంధం లేకుండా రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేశారు.
అన్నమయ్య జిల్లా కేంద్రంపై సొంత జిల్లా అయిన కడప జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గ వాసులు భగ్గుమంటున్నారు. ప్రత్యేక జేఏసీగా ఏర్పడి ఉద్యమిస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఇక వైసీపీకి సెలవు చెప్పేద్దామని ఊరి బయట బ్యానర్లు వెలుస్తున్నాయి. రాజంపేటను ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తే అటు కోడూరు రాజంపేట రాయచోటి వాసులకు మధ్యలో ఉంటుంది.
రాయచోటిని జిల్లా కేంద్రం చేస్తే అటు చిత్తూరుతో పాటు ఇటు కడప జిల్లాలో ఉన్న ప్రాంతాలకు కూడా దూరంగా ఉంటుందని వాపోతున్నారు. తాము గత ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించిన తమ అభిమాన పార్టీ వైసీపీకి ఇక సెలవు చెప్పేయాలంటూ గ్రామ శివార్లలో పోస్టర్లు వేస్తున్నారు. జిల్లాల విభజన వంచనకు నిరసనగా వైసీపీకి సెలవు చెప్పేయాలని.. రాయచోటి వద్దు.. రాజంపేట ముద్దు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.