ఏపీలో ఉద్యోగుల జీతాలూ.. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వానికి కాక పుట్టిస్తున్నాయి. ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు ఖాతాల్లో వేసింది. మూడో తేదీన ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతివ్వలేదు. జిల్లా, మండల కేంద్రాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలకు నోటీసులిచ్చారు. సాయంత్రంలోగా అరెస్టు చేసే అవకాశముంది. మరోవైపున తమ ప్రాంతాన్ని కొత్త జిల్లాల్లో కలపొద్దంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇంకొన్ని చోట్ల ప్రత్యేక జిల్లా డిమాండ్లు ముందుకొస్తున్నాయి. జిల్లాల విభజనపై వెల్లువెత్తుతున్న ఆందోళనలపై ఆరా తీయాలని ప్రభుత్వం ఆదేశించింది.
కొత్త పీఆర్సీతో జీతాలు పెరుగుతాయని మొదటి నుంచి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇప్పుడు చూశారా.. జీతాలు పెరిగాయా లేదా అంటున్నారు. దీనిపై ఉద్యోగుల్లో మరింత అసంతృప్తి నెలకొంది. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ ఫిట్మెంటు ప్రకారం జీతం తగ్గింది. డీఏ బకాయిలు కలిపి ఇవ్వడం వల్ల పెరిగినట్లు కనిపిస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. పోలీసులకు హెచ్ఆర్ఏ, సిటీ అలవెన్సుల్లో కోత పెట్టారు. దీంతో వాళ్లలోనూ తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి.
చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పీఆర్సీ సాధన సమితి సమావేశమైంది. జిల్లాల్లో ఎక్కడక్కడ నాయకులను నిర్బంధించే అవకాశం ఉన్నందున ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగులు విజయవాడ చేరుకుంటే అరెస్టు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఉద్యోగులు తలపెట్టిన ఆందోళన సభకు అనుమతి లేదని పోలీసు కమిషనర్ క్రాంతిరాణా టాటా స్పష్టం చేశారు. ఏమైనా ప్రభుత్వం ఉద్యోగులు తలపెట్టిన సభను విఘ్నం చేసేందుకు ప్రభుత్వం అన్ని వైపుల నుంచి చర్యలు తీసుకుంటోంది. రేపటి విజయవాడ సభ విజయవంతమవుతుందా లేదా అనేది అటు ప్రభుత్వంలో ఇటు ఉద్యోగుల్లో టెన్షన్ కొనసాగుతోంది.