పీఆర్సీ వివాదంలో ఏపీ ప్రభుత్వం పంతానికి పోయింది. ఉద్యోగుల నిరసనకు అనుమతి నిరాకరించింది. విజయవాడకు ఎవరూ రాకుండా పోలీసులతో నిఘా పెట్టింది. ఉద్యోగులు తగ్గేదే లేదన్నారు. ఆంక్షలను ఛేధించి కదిలారు. ఉప్పెనలా ఉద్యోగులు ఎగసి పడడంతో పోలీసులు చేతులెత్తేశారు. లక్షలాది మంది ఉద్యోగులు బెజవాడలో గర్జించారు. పీఆర్సీ కోసం నినదించారు. ప్రభుత్వం దిగొచ్చేదాకా విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ బీఆర్టీఎస్ రోడ్డు మార్మోగింది.
చలో విజయవాడ కార్యక్రమం తెలుగు ప్రజలకు పాత జ్ఞాపకాలను కళ్లెదుట నిలిపాయి. ప్రత్యేక తెలంగాణ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు పదేళ్ల క్రితం జరిగిన మిలియన్ మార్చ్ ను గుర్తుకు తెచ్చింది. ఉద్యోగులు, ఉద్యమకారులు పక్కా ప్లాన్ తో అనుకున్న టైంకి ఎలా చేరుకోవాలో ప్రిపేరయ్యారు. అడుగడుగునా పోలీసులుంటారు కాబట్టి ట్యాంక్ బండ్ మీదికి ఎలా చేరుకోవాలో ముందే భారీ పథకం సిద్ధం చేసుకున్నారు. ముళ్లకంచెలు, ముందస్తు అరెస్టులు.. ఇవన్నీ ముందు ఊహించినవే.
అనుకున్న చోటుకు వెళ్లి తీరాలి అనేదే వారి దృఢ సంకల్పం. అందులో భాగంగా ఉద్యోగులు, ఉద్యమకారులు వివిధ టీములుగా విడిపోయారు. ఏ టీము ఎక్కడ ఉండాలో క్రితం రోజు రాత్రే చేరుకున్నారు. ఎవరు ఏ టైమ్ కి ఎటువైపు నుంచి ట్యాంక్ బండ్ మీదికి రావాలో స్కెచ్ వేసుకున్నారు. ఒక్కొక్కరు, ఇద్దరిద్దరు సాధారణ పౌరుల్లా నెమ్మదిగా ట్యాంక్ బండ్ వైపు కదిలారు. ఒక్కొక్క మనిషే కనిపిస్తున్నా… కొన్ని నిమిషాల్లోనే లెక్కలేనంత మంది జమయ్యారు. జనసంద్రాన్ని తలపించారు. పోలీసులు చేతులెత్తేశారు. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ కూడా లైవ్.
సరిగ్గా అలాంటి దృశ్యమే ఇవాళ విజయవాడలో కనిపించింది. కొత్త పీఆర్సీ వద్దని, పాత పీఆర్సీనే ముద్దని, తాజా ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఏపీ ఉద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు. సమ్మెకు ముందు ప్రిపరేషనల్ సమ్మిట్ గా చలో విజయవాడను సక్సెస్ చేసి ప్రభుత్వానికి తమ సత్తా ఏంటో చూపాలనుకున్నారు. సక్సెస్ అయ్యారు. పోలీసుల కళ్లుగప్పి, వారి దృష్టిని దారి మళ్లించి ఉద్యోగులంతా బీఆర్టీఎస్ రోడ్డుకు చేరుకోవడం అచ్చంగా ఓ డిటెక్టివ్ సినిమాను తలపిస్తుందంటే ఆశ్చర్యపోవాల్సిందేం లేదు.
రైతుల వేషంలో కొందరు. వికలాంగుల వేషంలో ఇంకొందరు, బిచ్చగాళ్ల వేషంలో మరికొందరు, సామాన్య ప్రయాణికుల్లా..దారిన పోయే దానయ్యల్లాగా బయల్దేరారు. ఇలా అందరూ ఉద్యోగస్తుల్లా కాకుండా మారువేషాల్లోనే బీఆర్టీఎస్ రోడ్డుకు చేరుకోవడం నిజంగా ఓ చారిత్రక ఘట్టం. ఇప్పటికైనా సర్కారు ఉద్యోగుల డిమాండ్లపై చర్చించాలి.