అడుగడుగునా పోలీసు బలగాలు. బస్సుల్లో ప్రయాణిస్తున్న ఉద్యోగులను దింపేశారు. రైల్వే స్టేషన్లలో నిఘా పెట్టారు. హోటళ్లు, లాడ్జీల్లో ఉన్నవాళ్లను తీసుకెళ్లి అరెస్టు చేశారు. అసలు అదీఇదీ అన్లేదు. విజయవాడ పరిసరాల్లో ఎక్కడ నలుగురు ఉద్యోగులు కనిపించినా పోలీసులు పట్టుకెళ్లారు. ప్రతీ జిల్లాలో పోలీసు పహారాతో ఉద్యోగులను కదలకుండా కట్టడి చేశారు. అయినా రెండు లక్షల మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు విజయవాడ చేరుకున్నారు. నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. పోలీసు బలగాలతో హక్కులను హరించి వేయలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రభుత్వ పెద్దలు తమను చర్చలకు ఆహ్వానించి అవమాన పరిచినట్లు ఉద్యోగ సంఘ నేతలు భావించారు. పీఆర్సీ ఫిట్మెంటు 23 శాతం తమకు ఆమోద యోగ్యం కాదని తెగేసి చెప్పారు. మిగతా అనేక డిమాండ్ల విషయంలోనూ ప్రభుత్వం అర్థవంతమైన చర్చలకు అవకాశమివ్వలేదని పీఆర్సీ సాధన సమితి నేతలు వాపోయారు. చర్చలకు పిలిచి వాళ్లు చెప్పిందానికి తలూపాలని కోరడం వల్లే సమస్య మరింత జఠిలమైనట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం నియమించిన ఆశుతోష్ మిశ్రా కమిటీ సిఫారసులను ఎందుకు బయట పెట్టడం లేదని ఉద్యోగ సంఘ నేతలు ప్రశ్నించారు. ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కారం చేయాలన్నప్పుడు మిశ్రా నివేదికను దాచాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ప్రస్తుతానికి జీవోను వెనక్కి తీసుకొని పాత జీతాలు ఇవ్వాలని కోరినా స్పందించకుంటే ఇక చర్చలకు అవకాశమెక్కడుంటుందని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు కదం తొక్కారు. హక్కులను బలవంతంగా కాలరాయాలని ప్రభుత్వం భావిస్తే మరింత సంఘటితంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు తమ ప్రభుత్వంలో అంతర్భాగమన్నారు. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులకు చేయాల్సినంత చేశామన్నారు. అయినా వాళ్లలో అసంతృప్తి నెలకొన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు.
చర్చల ద్వారా ఉపాధ్యాయులు, ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని సజ్జల వెల్లడించారు. ఉద్యోగులు బల ప్రదర్శనకు పూనుకోవడం సరికాదన్నారు. ఇప్పటికీ సీఎం జగన్ ఉద్యోగులను సంతృప్తి పరచడానికి ఏమేం చేయాలనే దానిపై ఆలోచిస్తున్నట్లు తెలిపారు. చర్చల ద్వారా త్వరలో సమస్య పరిష్కారమవుతుందని సజ్జల ఆశాభావం వ్యక్తం చేశారు.