చదువుకున్నా ఉద్యోగం రాలేదని కుమిలిపోయే వాళ్లను చూశాం.
బలవన్మరణాలకు పాల్పడుతున్న వాళ్లనూ చూస్తున్నాం.
బతుకుదెరువుకు ప్రత్యామ్నాయం మార్గం చూసుకునే వాళ్లు కోకొల్లలు.
ఆమె మహిళని ఇంటికే పరిమితం కాలేదు.
భర్త ఆదాయం తగ్గిందని బాధ పడలేదు.
వినూత్నంగా మొబైల్ కూల్ డ్రింకు షాపు నడుపుతోంది.
ఆమె పేరు మాధవి.
సొంతూరు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి.
భర్త టైలర్. రెడీమేడ్ దుస్తులతో టైలరింగ్ వృత్తి పడిపోయింది.
కుటుంబం గడవడం కష్టమైంది.
తాను కూడా ఏదో ఒక ఉద్యోగం చేయాలనుకుంది.
ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
చివరకు హైవేపై మొబైల్ కూల్డ్రింకు షాపు పెట్టాలనుకుంది.
ఆరు నెలల క్రితం రూ. లక్ష పెట్టుబడితో మిషన్ కొనుగోలు చేసింది. దాన్ని తన స్కూటీకి బిగించింది.
హనుమాన్ జంక్షన్ హైవేపై తిరుగుతూ కూల్ డ్రింక్స్ అమ్ముతుంది.
సుగంధ, ఆరెంజ్, ద్రాక్ష.. ఇలా రకరకాల పానీయాలు పెట్టింది.
రోజుకు రూ.1500 ఆర్జిస్తోంది.
అదే వేసవిలో అయితే రూ. 2 వేలదాకా వస్తోంది.
“నాకు ఇద్దరు ఆడపిల్లలు.
నా భర్త ఆదాయం తగ్గిపోయింది.
పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాపారం మొదలెట్టా! కేవలం మగవాళ్లే ఈపని చేయాలనేముంది !
హైవేతోపాటు చుట్టుపక్కల గ్రామాలకూ వెళ్తా.
ఎవరి నుంచీ హేళనలు ఎదురు కాలేదు.
కష్టపడుతున్నందుకు ఇంకా ఎంతో గౌరవంగా చూస్తున్నారు !”
అంటున్న మాధవిలో ఆత్మాభిమానం తొణికిసలాడింది.
హ్యాట్సాఫ్ యూ తల్లీ !