కేంద్ర బడ్జెట్ పై స్పందిస్తూ కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ భారత రాజ్యాంగం పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పెద్ద దుమారమే రేగుతోంది. బీజేపీ పెద్ద ఎత్తున నిరసనలు తెలిపింది. కాంగ్రెస్ కూడా రెండు రోజుల నిరసనకు పిలుపునిచ్చింది.
కేసీఆర్ కామెంట్లు తెలంగాణలో రచ్చ అవుతున్నాయి. ఏపీలో మంట పుట్టిస్తున్నాయి. కేసీఆర్ మాటలు ఏపీ సీఎం జగన్ కు ఇబ్బందిగా మారాయి. కేసీఆర్ ప్రసంగంపై ఏపీ తెలుగుదేశం పార్టీ నాయకులు రియాక్టవుతున్నారు. దేశానికి కొత్త రాజ్యాంగం కావాలి అని కేసీఆర్ విలేకరుల సమావేశంలో చేసిన కామెంట్లపై టీడీపీ నేత మాజీ మంత్రి కేఎస్ జవహర్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ అలా మాట్లాడటం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ తో పాటు దేశ ప్రజలను అవమానించటమేనని జవహర్ ఆరోపించారు.
దేశంలోని అన్ని వర్గాల ఆకాంక్షలకనుగుణంగా నాడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని జవహర్ పేర్కొన్నారు. 75 ఏళ్ల నుంచి ప్రజల హక్కుల్ని స్వేచ్చను కాపాడుతూ వస్తున్న రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడటం సరికాదన్నారు. కేసీఆర్ వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి జగన్ ఎందుకు ఖండించలేదని జవహర్ ప్రశ్నించారు. జగన్ కూడా కేసీఆర్ వ్యాఖ్యల్ని సమర్ధిస్తున్నారా? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో రాజ్యాంగాన్ని మారిస్తే ఏపీలో చట్టబద్దంగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసుకోవచ్చని జగన్ భావిస్తున్నారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. కెఎస్ జవహర్ కామెంట్లు అధికార వైసీపీకి ఇబ్బందిగా మారాయనే చర్చ సాగుతోంది.