ఉపాధ్యాయ ఉద్యోగుల ఉద్యమం ఓ సందేశాత్మకం.
విజయవాడ నిరసన ర్యాలీ ప్రజల మెదళ్లలో తుప్పును వదిలించింది.
ఎందుకు.. ఏమిటి.. ఎలా.. అని ప్రశ్నించే తత్వానికి ఊపిరులూదింది.
సంఘటిత శక్తికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
నిర్బంధాలను అధిగమించి మొక్కవోని అకుంఠిత దీక్షను చాటింది.
ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనను అధికార పార్టీ శ్రేణులు వ్యతిరేకించాయి. ప్రతిపక్షాలు సంపూర్ణ మద్దతునిచ్చాయి. ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవా కాదా అనేది పక్కన పెడితే.. ఐదేళ్లకోసారి పెరుగుతున్న ధరలకు తగ్గట్టు వేతన సవరణ అనేది ఉద్యోగులు పోరాడి సాధించుకున్న హక్కు. దాన్ని పోరాటం ద్వారానే కాపాడుకోవాలని భావించారు. అంతటి అభద్రతా భావానికి గురి చేసింది ప్రభుత్వమే. ప్రభుత్వ పెద్దలే వాళ్లను ఆ స్థితికి నెట్టేశారు.
పీఆర్సీ ఫిట్మెంటు, ఇతర అంశాలకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. అశుతోష్ మిశ్రా నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచింది ! అందులో ఏముందో ఉద్యోగులు తెలుసుకోకూడదా ! తెలుసుకుంటే ఏమవుతుంది ? ఆ నివేదికపై చర్చిస్తే నష్టమేంటీ ! ప్రస్తుతం ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని తాము చేయగలిగిందేదో ఉద్యోగుల ముందు పెడితే పోయేది. అప్పుడు చర్చలకు ఓ ప్రాతిపదిక ఏర్పడేది. ఉద్యోగులు కూడా కొన్ని అంశాల్లో వెనక్కి తగ్గేవాళ్లు.
దీనికి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరించింది. చర్చల అర్థాన్ని మార్చేసింది. తామిచ్చిందే దేవుని ప్రసాదంగా భావించాలన్నట్లు ముందుకెళ్లింది. అధికారుల కమిటీకి ఎదురు మాట్లాడకూడదని చెప్పకనే చెప్పింది. ఇదేదో పేదల పథకం ఇస్తున్నట్లు ఈ ఒంటెద్దు పోకడలేంటనే ప్రశ్న ముందుకొచ్చింది. ఈ ఏకపక్ష ధోరణిని ఉపాధ్యాయ ఉద్యోగులు సహించలేకపోయారు.
వ్యవస్థలో అంతోఇంతో జీవన భద్రత కలిగిన జీవులు. మిగతా ప్రజలకన్నా తాము ప్రత్యేకమని ఉద్యోగుల్లో ఓ భావన ఉండేది. ప్రభుత్వమంటే తామేననే ఒకింత అధికారం చెలాయించేవాళ్లు. అలాంటి వాళ్లను టార్గెట్ చేస్తూ పోరాటం ద్వారా సాధించుకున్న హక్కులను కోల్పోతున్నామనే అభద్రతా భావంలోకి నెట్టేశారు.
అందుకే వాళ్లను పోలీసు బలగాలు నిలువరించలేకపోయాయి. రైల్వే, బస్టాండ్లలో నిఘాలు ఆపలేకపోయాయి. పోలీసు నోటీసులు భయపెట్టలేకపోయాయి. ఎలాగైనా గమ్యాన్ని చేరుకోవాలనే తాపత్రయం. ఏంచేసి అయినా నిరసన వ్యక్తం చేయాలనే పట్టుదల వాళ్లను విజయవాడకు తరలించింది. కొందరు కార్మికులుగా వేష ధారణతో వచ్చారు. హోటళ్లు, లాడ్జీల్లో పోలీసు నిఘా ఉన్నందున స్నేహితులు, బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు.
విజయవాడ నగర ప్రజలు ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఆతిథ్యమిచ్చారు. రోడ్డు వెంబడి నిలబడి మంచినీళ్లిచ్చారు. పోలీసుల కంటపడకుండా కిలోమీటర్ల కొద్దీ కాలి నడకన బీఆర్టీఎస్ రోడ్డుకు చేరుకున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కదం తొక్కారు. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని నినదించారు. మొత్తంగా బుద్ది జీవుల ఆందోళన భవిష్యత్ తరాల పోరాట పటిమకు దిక్సూచిలా నిలిచింది.