ఉద్యోగుల పంచాయితీకి శుభం కార్డు పడింది. మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి ప్రతినిధుల చర్చలు సానుకూలంగా ముగిశాయి. ఒక్క ఫిట్మెంటు తప్ప మిగతా విషయాల్లో ప్రభుత్వం మెత్తబడింది. హెచ్ఆర్ఏ స్లాబుల్లో మార్పులు చేశారు. సీసీఏ, ఏపీక్యూలాంటివి గతంలో ఇస్తున్నవాటినే కొనసాగించేందుకు కమిటీ అంగీకరించింది. ఉద్యోగుల జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ నగదు, ఇతర రుణాలకు సంబంధించి పెండింగ్ బిల్లులను మార్చి నెలాకరు నాటికి క్లియర్ చేయనున్నారు. దాదాపుగా మిగతా అంశాలన్నింటి విషయంలోనూ పాతవే కొనసాగించేందుకు ఇరువురి మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.
హెచ్ఆర్ఏలో స్వల్ప మార్పులతోపాటు సీసీఏ రద్దును వెనక్కి తీసుకోవడం, ఐదేళ్లకోసారి రాష్ట్ర ప్రభుత్వమే పీఆర్సీ ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. హెచ్ఆర్ఏ శ్లాబులకు సంబంధించి కొత్త ప్రతిపాదనను ఉద్యోగ సంఘాల ముందు మంత్రుల కమిటీ పెట్టింది. దాన్ని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు అంగీకరించలేదు. చివరకు 10, 12, 16 శాతం స్లాబుల ప్రకారం ఒప్పందం కుదిరింది. ఐఆర్ రికవరీ చేయబోమని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ తర్వాతే కొత్త పీఆర్సీ వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు. పెండింగ్ అంశాలను అభ్యంతరాల కమిటీకి పంపాలని మంత్రుల బృందం నిర్ణయించింది.
ఇప్పటికే ప్రకటించిన ఫిట్మెంట్ 23శాతానికేప్రభుత్వం కట్టుబడి ఉంది. కొత్త జీవో ప్రకారం జీతాలు చెల్లించినందున వెనక్కి తగ్గలేమని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. అయితే పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు మాత్రం కనీసం 27 శాతమైనా ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మంత్రుల కమిటీ సాధ్యం కాదని వెల్లడించింది. రాత్రి పది గంటల తర్వాత పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు, మంత్రులు జాయింట్ మీడియా సమావేశంలో చర్చల వివరాలు వెల్లడించనున్నారు.
అనంతరం మంత్రులతోపాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎం జగన్ను కలిసే అవకాశముంది. గనుల శాఖలో ఎస్మా ప్రయోగించడం శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల జరిగిందని మంత్రులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఎస్మాను ఉపసంహరించుకుంది. ఫిట్మెంటు విషయంలో 23 శాతానికి సాధన సమితి ప్రతినిధులు అంగీకరించడంపై ఉపాధ్యాయులు గుర్రుగా ఉన్నట్లు తెలిసింది.