ఉపాధ్యాయ.. ఉద్యోగుల నిరసన గర్జనతో ప్రభుత్వం కొన్ని మెట్లు దిగింది. అర్ధరాత్రి దాకా పీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చించింది. హెచ్ఆర్ఏ స్లాబులను కొంత తగ్గిస్తామని చెప్పారు. ఐఆర్ రికవరీ ఉండబోదని మంత్రుల కమిటీ హామీనిచ్చింది. అసలు అశుతోష్ మిశ్రా నివేదికను బయటపెట్టాలని సాధన సమితి నేతలు డిమాండ్ చేశారు. కొత్త పీఆర్సీ జీవోను రద్దు చేయాలని కోరారు. ఫిట్మెంటు ఐఆర్కు తగ్గకుండా ఇవ్వాలని అడిగారు. దీనిపై మళ్లీ శనివారం చర్చించి చివరిగా సీఎం జగన్ వద్ద పంచాయితీకి ముగింపు పలకాలని మంత్రులు భావిస్తున్నారు.
హెచ్ఆర్ఏకు సంబంధించి కొత్త పీఆర్సీ జీవోలో పేర్కొన్న దానికి కొంత సడలింపునిచ్చారు. 5 నుంచి 50 లక్షల జనాభా పరిమితిని కుదించి 15 లక్షల జనాభా కలిగిన పట్టణాల్లో 16 శాతంగా పేర్కొన్నారు. 15 లక్షలు దాటితే 24 శాతంగా మంత్రుల కమిటీ వెల్లడించింది. దీనికి ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. దీనివల్ల కేవలం విశాఖలో ఉండేవాళ్లకు మాత్రమే ఊరట లభిస్తుందంటున్నారు. పాత శ్లాబులనే కొనసాగించాలని పీఆర్సీ సాధన సమితి కోరింది.
పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ చెల్లింపుల్లోనూ ప్రభుత్వం కొంత దిగొచ్చింది. 80 ఏళ్ల నిబంధనను సవరించారు. 70 ఏళ్లు దాటిన వారికి 5 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 10 శాతం ఏక్యూపీ ఇస్తామని హామీనిచ్చారు. దీనిపై సాధన సమితి అంగీకరించలేదు. పాత పద్దతినే కొనసాగించాలని పట్టుబట్టారు.
ఇక పదేళ్లకో పీఆర్సీ నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గి ఐదేళ్లకే పీఆర్సీ ఇస్తామని చెప్పింది. కోత పెట్టిన సీసీఏను మళ్లీ పునరుద్దరిస్తామని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ నగదుతోపాటు ఇంటి రుణాలు, పెళ్లి కోసం దరఖాస్తు చేసిన రుణాలు కలిపి సుమారు రూ.1800 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ వెంటనే విడుదల చేయాలని సాధన సమితి నేతలు కోరారు.
మొత్తంగా ఇరువైపులా చర్చలు సమస్యల పరిష్కారం దిశగా సాగాయి. శనివారం ఉదయం మంత్రుల కమిటీ మరోసారి సీఎం జగన్తో చర్చించనున్నారు. మధ్యాహ్నం ఫైనల్గా పీఆర్సీ సాధన సమితి నేతలతో చర్చిస్తారు. అనంతరం సీఎం జగన్ వద్ద ఈ లడాయికి ముగింపు పలకాలని భావిస్తున్నారు. చర్చలు విఫలమైతే సమ్మెకు సిద్దంగా ఉండాలని ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఆరోతేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు.