” ఏం చేద్దాం సార్ !
పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి.”
అంటూ రవికాంత్ వైపు చూశారంతా.
పార్కులో సమావేశం.
ఎవరి వాదన వాళ్లు వినిపించారు.
సోషల్ మీడియాలో పోస్టులకు ప్రజల నుంచి
లైకులు.. కామెంట్లు వచ్చాయి.
ప్రభుత్వాలు మాత్రం తీవ్రంగా స్పందించాయి.
అక్రమ కేసులు బనాయించేందుకు సిద్ధమయ్యాయి.
కౌలు రైతులకు రుణాలివ్వడం లేదంటే నేతలకు కోపమొస్తోంది. ఉపాధిహామీ నిధులు బొక్కేశారంటే కన్నెర్రజేస్తున్నారు.
కార్పొరేట్ విద్యతో పిల్లలను చంపేస్తున్నారంటే పట్టించుకోరు.
రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రత్నాల జపంతోనే మునిగితేలుతోంది.
అప్పుల తిప్పలతో ఓ అడుగు ముందుకేస్తే..
నాలుగడుగులు వెనక్కి పడుతున్నాయి.
కొవిడ్ తర్వాత అగాథంలోకి జారిన
సగటు బతుకుల గురించి పట్టించుకోవడం లేదు.
చిరుద్యోగులు చితికిపోయారు.
చిరు వ్యాపారులు నలిగిపోయారు.
ఉపాధి కరవైంది. స్వయం ఉపాధి అటకెక్కింది.
బతుకు దెరువు కోసం ఊరు పొమ్మంటోంది.
కేంద్ర సర్కారు ప్రజల నెత్తిన భారాలు మోపుతోంది.
అంబానీ, ఆదానీలను ప్రపంచ కుబేరులను చేస్తోంది.
గట్టిగా నిలదీస్తే దాడులు.. కేసులు తప్పడం లేదు.
” ఓ పని చేద్దాం ! ఇప్పటిదాకా సోషల్ మీడియా ద్వారా
ప్రజా సమస్యలకు పరిష్కారాలు సూచించాం !
విపక్షాలు కేవలం రాజకీయ ప్రయోజనాలకే పరిమితమవుతున్నాయి.
ఎన్నికలప్పుడు ఓట్ల కోసమే కాదు.
ప్రజలకు కష్టం వచ్చినప్పుడు
అండగా నిలవాలని రాజకీయ పక్షాలను కోరదాం !
మనం నేరుగా ప్రజలను కలుసుకునే విధంగా
పంథా మార్చుకుందాం.”అని సూచించాడు రవికాంత్.
అంతా సగటు మధ్యతరగతి వాళ్లే.
ఏదో పనిచేసుకుంటే తప్ప ఇంట్లో పిల్లి లేవదు.
పని వదిలేసి ఊళ్లు పట్టుకొని తిరగాలంటే సాధ్యం కాదు.
మరేం చెయ్యాలి ! క్యాంపెయిన్ ఎలా చెయ్యాలి ?
ఇదే ప్రశ్న తొలుస్తోంది అందర్నీ.
” ఇదిగో..ఇది నాంతు ..” అంటూ మెడలోని చైన్ తీసిచ్చింది మాలిని.
వెంటనే ప్రసాద్ లేచి తన మూడెకరాల్లో
ఓ ఎకరం అమ్మేసిస్తానని ప్రకటించాడు.
ఇలా ఎవరికి వాళ్లు తమకు తోచిన విధంగా ఆర్థిక వితరణ చేశారు.
రవికాంత్ వంతొచ్చింది.
ఫోన్ తీసి ఎవరితోనో మాట్లాడాడు.
కొద్దిసేపటికి రవి భార్య సునంద ఏవో పేపర్స్ తీసుకొచ్చింది.
” ఇవి మా ఇంటి డాక్యుమెంట్స్.
మా దగ్గర ఇంతకన్నా ఏం లేవు.”
అంటూ పేపర్స్ రవి చేతికిచ్చింది.
అంతా నిశ్శబ్దం.
అతని కళ్లల్లో కన్నీటి మెరుపులు..
రవి భుజం తడుతూ పర్వాలేదన్నట్లు చూసింది.
మొక్కవోని దీక్షతో లేచారంతా..
భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతూ !
– ప్రజారంగంలో కష్టాలు.. కన్నీళ్లకు ఎదురీదుతున్న ధీరోదాత్తులకు కథానిక అంకితం.