ఆమె గానం బండరాళ్లను సైతం కరిగిస్తుందా అనిపిస్తుంది. ఆమె గాత్రం మనసులోని సుకుమారపు తీగలను మీటుతుంది. కొన్ని తరాలకు గానకోకిలైన భారతరత్న లతా మంగేష్కర్ ఆదివారం కన్నుమూశారు. 80 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కు వీడ్కోలు పలికారు. ఆ 92 ఏళ్ల గానసరస్వతి దేవగాన సభకు తరలిపోయారు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. ఓ సందర్భం మాత్రం లతకు ఎప్పటికీ మరచిపోలేనిదిగా నిలిచిపోయింది. అదే ఆమెపై విష ప్రయోగం ఘటన
లత ఇంట్లో పనిమనిషే ఆమెకు క్రమక్రమంగా విషాన్ని ఇచ్చి చంపేందుకు ప్రయత్నించాడు. ఆ విషయాన్ని పలు సందర్భాల్లో ఆమె గుర్తు చేసుకుంటుండేవారు. లత జీవితంపై నస్రీన్ మున్నీ కబీర్ రాసిన ‘లతా మంగేష్కర్ ఇన్ హర్ ఓన్ వాయిస్’ అనే పుస్తకంలో కూడా ఆ ఘటన గురించి లత పూసగుచ్చారు. 1962 నాటికే బాలీవుడ్ లో అద్భుత గాయనిగా లత నిలదొక్కుకున్నారు.
ఏమైందో ఏమో ఉన్నట్టుండి ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యారు. పచ్చగా వాంతులవుతుండటంతో వెంటనే ఆమె కుటుంబ వైద్యులు ఇంటికి చేరుకున్నారు. మంచంపై నుంచి లేచే పరిస్థితి కూడా లేదు. ఏకంగా ఎక్స్ రే మెషీన్ ను ఇంటికి తెచ్చి ఆమెకు పరీక్షలు చేశారు. ఈ క్రమంలో ఆమెకు ఎవరో క్రమక్రమంగా విషాన్ని శరీరంలోకి ఎక్కిస్తున్నారని వైద్యులు ధ్రువీకరించారు.
వైద్యులు అలా చెప్పీ చెప్పగానే పనిమనుషుల్లో ఒకడు వెంటనే పరారయ్యాడు. ఘటన జరిగిన తర్వాత మూడు నెలల పాటు లత మంచంపై నుంచి లేవలేకపోయారు. ఎవరో అతడికి డబ్బులిచ్చి తనకు విషం ఇచ్చేలా చేశారని.. అది ఎవరో కనిపెట్టలేకపోయామని లత చెప్పుకొచ్చారు. ఆ తర్వాత లతకు వంట బాధ్యతను ఆమె సోదరి ఉష భుజాన వేసుకున్నారట.
ఆ మూడు నెలలూ ప్రముఖ రచయిత మజ్రూ సుల్తాన్ పురీ తనకు సాయంగా నిలిచారని కూడా లత పుస్తకంలో వివరించారు. ఆ ఘటన నుంచి కోలుకున్న తర్వాత లత పాడిన తొలి పాట ‘కహీ దీప్ జలే కహీ దిల్.’ ఆ పాట రికార్డుల మోత మోగించి ఆమెకు రెండో ఫిల్మ్ ఫేర్ అవార్డును తెచ్చిపెట్టడం కొసమెరుపు.