“ కొడుకు పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటే తండ్రి బైక్ కొనిస్తానన్నాడు. కుమారుడు పాసయ్యే నాటికి తండ్రి దివాళా తీశాడు. నాన్న బైక్ కొనివ్వలేదని కొడుకు తిట్టుకుంటే ఆ తండ్రి ఏం చేయగలడు !” జీతాలకు కోత పెట్టడం అన్యాయం సార్ అంటూ వాపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగినికి సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఇచ్చిన సమాధానం అది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి గురించి ఆయన చెప్పకనే చెప్పేశారు. నిన్న చర్చల సందర్భంగా చోటుచేసుకున్న ఓ సన్నివేశం ఇది.
ఇంకా ఏమన్నారంటే.. ‘రాష్ట్రంలో 1.57 మంది దారిద్య్ర రేఖకు దిగువనున్నారు. వాళ్లంతా ఉప్పూ పప్పూ కొంటూ జీఎస్టీ కడుతున్నారు. వాళ్ల నుంచి ప్రభుత్వం ఆదాయం పొందుతూ వారికేమీ చేయొద్దా ! వచ్చే రాబడిలో ఉద్యోగుల జీతాలకు.. తెచ్చిన అప్పుల కిస్తీలు కట్టడానికే సరిపోవడం లేదు. మరి వాళ్ల కోసం ఏమీ చేయొద్దా తల్లీ !’ అని మంత్రి నాని సెలవిచ్చారు.
ఏదోలా కాస్త పెద్ద మనసు చేసుకోండి సార్ అని ఆమె రిక్వెస్టు చేస్తే.. ‘ఇది మనసుకు సంబంధించిన అంశం కాదమ్మా! గల్లా పెట్టెతో కూడుకున్న వ్యవహారం. ఇప్పుడు పెంచితే మరో నాలుగు నెలల్లోనైనా జీతం ఇవ్వాల్సిందే కదా ! రెండు లక్షలు వడ్డీకి తెచ్చి తీరా తీర్చాల్సిన సమయానికి దివాళా తీస్తే వడ్డీ తగ్గించమని వేడుకుంటాం కదా ! అలా ఉంది రాష్ట్ర పరిస్థితి ’ అంటూ మంత్రి ఆమెకు అర్థమయ్యేట్లు చెప్పారు.
మంత్రి పేర్ని నాని రాష్ట్ర పరిస్థితిని ఉన్నదున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం దివాళా అంచుకు చేరిందని చెప్పకనే చెప్పారు. వాస్తవం చెప్పినందుకు హర్షించాల్సిందే. మరి ఈ దుస్థికి రావడానికి కారణాలేంటో ప్రభుత్వ పరంగా సమీక్షించుకున్నారా ! పేదల నుంచి మధ్య తరగతి దాకా కొవిడ్ తో ఆర్థిక సంక్షోభానికి గురయ్యారు. అయినా ప్రభుత్వానికి రాబడి తగ్గకపోగా పెరిగిందని సర్కారు లెక్కలే స్పష్టం చేస్తున్నాయి.
మరి అలాంటప్పుడు ఇలా దివాళా తియ్యడమేంటీ ! ఎన్నికల సమయంలో అలవిమాలిన హామీలిచ్చారా ! రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అంచనా వేయకుండానే ఇవన్నీ అమలు చేశారా ! దీనికి బాధ్యులెవరు ! వీటిక్కూడా గౌరవ మంత్రి పేర్ని నాని సమాధానాలు ఇస్తే ఇంకెంత బావుంటుందో కదా !