‘ఆ నలుగురూ ఉద్యమ ద్రోహులు. ఉద్యోగుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. వాళ్లను ఎంతమాత్రం క్షమించకూడదు.’అంటూ ఉపాధ్యాయులు, ఆర్టీసీ, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ‘ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక దుస్థితిని అర్థం చేసుకున్నాం. ఇంతకు మించి తెగేదాకా లాగడం మంచిది కాదు. పాలు వచ్చిన వరకే పితకాలి. బలప్రయోగం చేస్తే రక్తం కారుతుంది !’ అంటూ ఏ పరిస్థితుల్లో ఒప్పందాలకు తలొగ్గాల్సి వచ్చిందో నలుగురు ఉద్యోగ సంఘ నేతలు సమాధానమిచ్చారు. ఉద్యోగ సంఘాల్లో అనైక్యత సృష్టించాలనే ఎత్తుగడతోనే ఇదంతా జరుగుతోందని సాధారణ ఉద్యోగులు వాపోతున్నారు.
వాస్తవానికి ఉద్యోగులకు ఐదేళ్లకోసారి పే రివిజన్ చేయాలి. అది వాళ్లు దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న హక్కు. సకాలంలో పీఆర్సీ ఇవ్వకుంటే ఐఆర్ ఇస్తుంటారు. ఐఆర్ అనేది వడ్డీ లేని రుణంగా సీఎస్ కొత్త భాష్యం చెప్పారు. దాన్ని వేతనం నుంచి రికవరీ చేస్తామని ప్రకటించారు. అసలు పీఆర్సీ కోసం నియమించిన అశుతోష్ మిశ్రా నివేదికను ఇప్పటిదాకా బయట పెట్టలేదు.
సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ ఎన్నికల ముందు హామీనిచ్చారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తామని భరోసానిచ్చారు. ఈ హామీలేవీ నెరవేర్చకుండా హెచ్ఆర్ఏలో కోత, సీసీఏ ఎత్తివేయడం, ఏక్యూపీ స్లాబుల్లో మార్పు చేశారు. ఐఆర్ కన్నా ఫిట్ మెంటు తక్కువగా ఇవ్వడంతో అనివార్యంగా ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు ఓ పీఆర్సీని నష్టపోయారు. ఇంకా వాళ్ల డిమాండ్లు ఒక్కటీ చర్చల్లో చోటు చేసుకోలేదు. పెన్షనర్లకు సంబంధించిన అంశాలూ కొన్ని పెండింగులోనే ఉన్నాయి. మొత్తం 75 అంశాలపై ఉద్యోగులు ప్రభుత్వం ముందు పెట్టారు. ఇవేవీ చర్చల్లో చోటు చేసుకోలేదు.
కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 23 శాతం వేతనం పెంచారు. సగటు ఉద్యోగికి రూ.3 వేలు మాత్రమే పెరిగింది. రెగ్యులర్ ఊసే లేదు. సమాన పనికి సమాన వేతనమూ లేదు. ఉద్యోగులు అడగకున్నా రిటైర్మెంటును రెండేళ్లు పెంచారు. దీని వల్ల వెట్టిచాకిరీ తప్ప తమకు ఒనగూడేదేమీ లేదని ఉద్యోగులు వాపోతుంటే.. అదేదో ఘన కార్యం లాగా ప్రభుత్వం చెబుతోంది.
సీపీఎస్ రద్దుపై అవగాహన లేకుండా హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక దుస్థిని బట్టి సర్దుకుపోవాలని ఉద్యోగులకు సూచించారు. అసలు రాష్ట్ర ఆదాయమెంత.. అందులో వేతనాల బడ్జెట్ ఎంతుంటుందో ప్రభుత్వ పెద్దలకు ఎన్నికల ముందు అవగాహన లేదా ! సరైన అంచనాతోనే సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలో పెట్టారా !
అలా అయితే గడచిన మూడేళ్లలో నాలుగున్నర లక్షల కోట్ల అప్పులు తెచ్చినా ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎందుకు దాపురించింది ? అంచనాకు తగ్గట్టు వాస్తవిక ఆదాయం రాలేదని అనుకుందాం. ఏటా సగటున రూ.15 వేల కోట్లు తగ్గినా.. రాబడి తగ్గింది రూ.45 వేల కోట్లే. మరి తెచ్చిన అప్పులన్నీ ఎటుపోయాయి ? ఇక్కడ తప్పెవరిది ?
ఎన్నికల మేనిఫెస్టో తమకు భగవద్గీత, బైబిల్, ఖురాన్తో సమానమని సీఎం జగన్ అనేక సార్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఉద్యోగులకు ఇచ్చిన హామీల దగ్గరకొచ్చే సరికి ఆర్థిక దుస్థితిని ముందు పెడుతున్నారు. ఇదంతా తరిచి చూస్తే.. అవగాహనా రాహిత్యమేనని స్పష్టమవుతోంది. అలవికాని హామీల వల్లే నెలనెలా జీతాలు సక్రమంగా ఇవ్వలేని పరిస్థితులు దాపురించినట్లు తేటతెల్లమవుతోంది.
ప్రభుత్వ ఆదాయం.. ఖర్చులపై సరైన అవగాహన ఉంటే ఏడాదిన్నర నుంచి ఆస్పత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బందికి జీతాలు ఎందుకివ్వలేకపోతున్నారో అర్థమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు తమ విధి విధానాలను, లోపాలపై పున:సమీక్షించుకోవాలి. ప్రజలకు వాస్తవ పరిస్థితులు వెల్లడించాలి. హామీలను ఎందుకు అమలు చేయలేకపోతున్నామనేది అయినా భేషజాలకు పోకుండా వివరించాలి.