వేతన జీవులు ఒకటో తేదీ కోసం ఎదురుచూస్తుంటారు. నెల రోజులు చేసిన పనికి ఆ రోజే జీతం వస్తుంది కాబట్టి. ఒకటో తేదీతో వాళ్లకు ఎంతో అనుబంధం ఉంటుంది. ఎపుడు వస్తుందా ఫస్ట్ తేదీ అని రోజూ క్యాలండర్ అటూ ఇటూ తిప్పేస్తూంటారు. అలాంటిది ఉద్యోగులకు, వేతన జీవులకు వారానికి ఒకసారి జీతాలు అంటే ఎలా ఉంటుంది ! ఎగిరి గంతేయరూ !
సరిగ్గా ఈ పాయింట్స్ నే పట్టుకుని దేశంలో తొలిసారి ఓ కార్పొరేట్ సంస్థ దీనిపై ప్రయోగం చేయబోతోందిట. ఇండియన్ మార్ట్ సంస్థలో ఇక నెల జీతాలకు స్వస్తి పలకబోతున్నారట. ఏ వారానికి ఆ వారమే జీతాలు చెల్లించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని వల్ల ఉద్యోగుల ఆర్ధిక ఇబ్బందులు బాగా తగ్గుతాయని యాజమాన్యం చెబుతోంది.
ఉద్యోగి ఆర్ధికంగా చికాకులు లేనపుడు మనసు పెట్టి సంస్థ శ్రేయస్సు కోసం పనిచేస్తాడని ఆ కంపెనీ ఆశిస్తోంది. దీని వల్ల చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయని కూడా ఊహిస్తున్నారు. ఒక విధంగా ఇది మంచి విధానమే అని ఆర్ధిక నిపుణులు కూడా వక్కాణిస్తున్నారు. నెల జీతగాళ్లకు మనసు ఎపుడూ ఆర్ధికపరమైన ఆలోచనల్లో ఉంటే కచ్చితంగా వారు పని మీద దృష్టి నిలపలేరు. ఇది పలు అధ్యయనాల్లో రుజువైంది. అలా కాకుండా వారి ఈతి బాధలను పట్టించుకున్న చోట సంస్థ కూడా మరింతగా రాణిస్తుందని నిర్ధారిస్తున్నారు.
ఇప్పటికే న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, అమెరికా వంటి దేశాల్లో వారానికోసారి జీతాలు ఇచ్చే విధానం అమలులో ఉంది. దీని వల్ల అక్కడ కంపెనీలు మంచి లాభాలు కూడా కళ్ల చూస్తున్నాయట. మరి ఇండియా మార్ట్ సంస్థ దేశంలో తొలిసారి ఈ ప్రయోగం చేస్తోంది. ఇది కనుక సక్సెస్ అయితే మిగిలిన వారు కూడా ఇదే బాటలో నడిచే వీలుంది.
ఇక్కడ మరో విషయం కూడా ఉంది. వారానికి ఒకసారి అంటే జేబు కూడా ఎప్పుడూ బరువుతోనే ఉంటుంది. అది మనిషి మానసిక ఉల్లాసానికి కూడా ఓ టానిక్ గా పనిచేస్తుందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ధన మూలం ఇదం జగత్ అన్న సూక్తి ఎటూ ఉంది. అందువల్ల డబ్బుతోనే ఏ జబ్బు కూడా దరి చేరదు మరి.