కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. యారప్ ను అల్లాడించింది. అగ్రరాజ్యం అమెరికాను ఆగమాగం చేసింది. మనదేశంలోనూ థర్డ్ వేవ్ రూపంలో విరుచుకుపడింది. అయితే డెల్టా వేరియంట్ లా ఒమిక్రాన్ తో మరణాలు సంభవించలేదు. భారతీయులు ఆసుపత్రులకు పరుగులు పెట్టటం.. ఆక్సిజన్ కోసం క్యూలు కట్టటం.. వైద్యం అందక ఆసుపత్రి ప్రాంగణంలోనే ప్రాణాలు విడవడం లాంటి దారుణ ఘటనలు చోటు చేసుకోలేదు. డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువగా ఉండడం.. హోం ఐసోలేషన్ తోనే కోలుకోవడం ఊరట కల్గించింది.
ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం పడుతున్న వేళ తర్వాతేంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి సంబంధించి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక విషయాలు వెల్లడించింది. మరో వేరియంట్ పుట్టుకొస్తే దాని వ్యాప్తి ఎలా ఉంటుందన్న విషయాన్ని వివరించింది. కొత్త వేరియంట్ పుట్టుకొస్తే ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వేరియంట్ల కంటే అధిక శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాయని డబ్ల్యూహెచ్ టెక్నాలజీ హెచ్మరియా వాన్ కెర్ఖోవ్ వెల్లడించారు. ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తి చెందే గుణంతో పాటు రోగ నిరోధక శక్తిని ఏమార్చే గుణం కూడా ఎక్కువగా ఉండొచ్చని చెప్పారు.
‘కొత్త వేరియంట్ మీద టీకాల ప్రభావం ఉండకపోవచ్చు. ప్రపంచం ఇలాంటి స్థితిలోకి చేరుకోకూడదని కోరుకుంటున్నాం. కొవిడ్ వ్యాప్తిని అరికట్టాలని ఆశిస్తున్నాం. కట్టుదిట్టమైన నిబంధనలతో వైరస్ వ్యాప్తి స్వల్పంగా ఉంటుందని ఆశిస్తున్నాం’ అని వాన్ కెర్ఖోవ్ చెప్పారు. వైరస్ ను అరికట్టేందుకు జాగ్రత్తలు పాటించాలని కోరుతూ రాబోయే రోజుల్లో కరోనా సీజనల్ వ్యాధిగా రూపాంతరం చెందొచ్చన్నారు. శ్వాసకోశ వ్యాధికారకంగా మారే అవకాశం ఉందని తెలిపారు.
వైరస్ నుంచి బయటపడాలంటే ప్రస్తుతం మాత్రం మాస్కు.. భౌతిక దూరం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. అలా అని జీవితాంతం మాస్కులు ధరిస్తూనే ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఒమిక్రాన్ చివరి వేరియంట్ కాదని, రాబోయే రోజుల్లో మరిన్ని వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశాలు ఉందని వివరించారు.