అబ్బాస్.. 90వ దశకం చివరికొచ్చేసరికి ఈ పేరు తెలుగు, తమిళ రాష్ట్రాలను ఒక ఊపు ఊపిందంటే ఆశ్చర్యం లేదేమో. ముఖ్యంగా అమ్మాయిలకు కలల రాకుమారుడిలా మారిపోయాడు అబ్బాస్. 1996లో వచ్చిన ప్రేమదేశం అతడికి తొలిసినిమా. అదే మేలిమలుపునిచ్చిన సినిమా కూడా. ఆ ఒక్క సినిమా సూపర్ హిట్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయాడు.
మరీ ముఖ్యంగా అతడి హెయిర్ స్టైల్ కు చాలామంది ఫ్యాన్స్ ఉండేవారు. ఎవరైనా కొంచెం జుట్టు పొడుగ్గా పెంచుకుని తిరిగితే ఏరా అబ్బాస్ అనుకుంటున్నావా అంటూ అప్పట్లో కాలేజీల్లో కౌంటర్లు వినిపించేవి. ప్రస్తుత జనరేషన్ కు అబ్బాస్ కేవలం హార్పిక్ యాడ్ అబ్బాస్ గా మాత్రమే తెలుసు. 1995-2000 మధ్యలో కాలేజీ స్టూడెంట్స్ అందరికీ అబ్బాస్ సినిమాలు బాగా గుర్తుంటాయి. చాలామంది అబ్బాస్ తమిళనాడుకు చెందిన వాడు అనుకుంటారు. కానీ అతడి స్వస్థలం పశ్చిమ బెంగాల్ లోని హౌరా.
అబ్బాస్ తాతగారు ఫారుఖ్ మీర్జా బెంగాలీ సినిమాల్లో నటించారు. ప్రేమ దేశం అనే సినిమా కోసం డైరెక్టర్ కదిర్ కొత్త నటుల్ని వెతుకుతున్నారని తెలిసిన అబ్బాస్ స్నేహితుడొకరు బలవంతంగా అతడిని ఆడిషన్స్ కు పంపించాడు. దక్షిణాదివాడు కాకపోయినా.. తెలుగు, తమిళ ప్రజలు అతడిని తమ రాష్ట్రంలోని వ్యక్తిలాగే ప్రేమించారు. ఇక ప్రేమదేశం తర్వాత 1997లో ప్రియా ఓ ప్రియా అంటూ ప్రేక్షకుల్ని పలకరించి మరోమారు బంపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.
తెలుగులో 10 సినిమాలే చేసినా.. చిరకాలం గుర్తుండిపోయే పేరు తెచ్చుకోగలిగాడు. మొత్తం కెరీర్ లో కేవలం 50 సినిమాలను మాత్రమే చేసిన అబ్బాస్.. చివరిగా 2014లో రామానుజన్ అనే సినిమాలో కనిపించాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు? 2014 తర్వాత కుటుంబ సమేతంగా అబ్బాస్ న్యూజిలాండ్ వెళ్లిపోయాడు.
అక్కడే ఓ పెట్రోల్ పంపులో మొదట ఉద్యోగం చేసేవాడు. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి.. వివిధ వ్యాపారల్లోకి చేరాడు. అప్పుడప్పుడు మోటివేషనల్ స్పీకర్ గా, ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండే అతడి నివాసం. ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంటాడు. సినిమాలకు సంబంధించి మాత్రం ఇప్పట్లో నటించే ఆలోచన లేదని చెబుతున్నాడీ మాజీ లవర్ బాయ్.