ఎప్పుడో మూడు ముక్కలు తీసుకొచ్చి కలిపిన ప్రకాశం జిల్లా రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ జర్నలిస్టులూ వెనుకబాటుతనాన్ని అధిగమించలేదు. సొంత ప్రెస్ క్లబ్ భవనం లేని జిల్లా ఏదైనా ఉందంటే అది ప్రకాశమే. ఎట్టకేలకు ఇప్పుడొక ముందుడుగు పడింది. ప్రెస్ క్లబ్ సాధన కోసం ఏకంగా కమిటీనే ఏర్పాటయింది.
ఒంగోలులో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులంతా ఈరోజు సమావేశమయ్యారు. కొన్నేళ్ల నుంచి జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ అద్దె భవనంలో కొనసాగుతోంది. ప్రభుత్వం సాయం లేకుండా సొంతంగా ప్రెస్ క్లబ్ భవనం ఏర్పాటు చేసుకోవడం కష్టం. అందుకే జర్నలిస్టులంతా దీనిపై ఏకమయ్యారు. ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఎలాగైనా సాధించాలనే తపనకు తొలి అడుగు పడింది.
గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. జర్నలిస్టులు వివిధ సంఘాలుగా ఏర్పడడంతో ఎవరు అధికారంలోకి వచ్చినా పట్టించుకోలేదు. అదేమంటే అందరూ కలిసొస్తే తామేదైనా చేయగలమని ప్రజాప్రతినిధులు తప్పించుకుంటూ వచ్చారు. గతంలో అనేక దఫాలు కలెక్టర్ల దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టరేట్లోనే ఓ భవనం నిర్మించి ఇవ్వాలని అడిగారు. వీలుపడలేదు.
తర్వాత కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో ఏర్పాటుకు ఓ ప్రయత్నం జరిగింది. జర్నలిస్టుల్లో అనైక్యత, అధికారుల అలసత్వం వల్ల అది కూడా అటకెక్కింది. ఈసారి ఎలాగైనా పట్టుబట్టి సాధించాలని ఓ కమిటీగా ఏర్పడ్డారు. మంత్రి బాలినేని దృష్టికి తీసుకెళ్లి సాయం కోరాలని నిర్ణయించారు. వినాయకుడి పెళ్లి సామెతగా కాకుండా ఈసారి గట్టి ప్రయత్నం చేయాలని నిశ్చయించుకున్నారు.