పీఆర్సీ ఉద్యమం మళ్లీ ఉధృతమవుతోంది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకున్నాం. ఉన్నంతలో మెరుగైన పీఆర్సీ సాధించామని ఉద్యోగ సంఘాల నేతలు వివరణ ఇచ్చారు. ఉపాధ్యాయ, ఆర్టీసీ, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం అంగీకరించడం లేదు. మంత్రుల కమిటీతో చివరి దఫా చర్చల సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నేతలు తమకు అంగీకారం కాదని వాకౌట్ చేశారు. మరి వాళ్లను కాదని చర్చలను ఎలా కొనసాగించారనేది ఇప్పుడు వివాదమైంది. అదే మంత్రుల కమిటీలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉండి ఉంటే అక్కడే పరిష్కారమయ్యేదని అధికార పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
వాస్తవానికి మంత్రుల కమిటీ ఉద్యోగులందరి సమస్యలకు ఓ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చర్చల్లో ముందు పెట్టాల్సింది. ఉద్యోగులతోపాటు ఉపాధ్యాయులు, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆర్టీసీ, పెన్షన్దారులకు సంబంధించిన అంశాలను విడివిడిగా చర్చించాల్సింది. కేవలం ఫిట్మెంటు, హెచ్ఆర్ఏ, సీసీఏ, ఏపీక్యూలాంటి ప్రధాన అంశాలపైనే ఉద్యోగ సంఘాలు దృష్టి పెట్టాయి. అందువల్లే మిగతా వాళ్ల సమస్యలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించలేదనేది వాళ్ల ఆక్రోశం.
ప్రభుత్వం వైపు నుంచి అదే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కమిటీలో ఉండి ఉంటే చర్చలు ఇలా జరిగేవి కావని ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో అధికార పార్టీ సానుభూతిపరులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉద్యోగుల్లో ఆయా వర్గాల వారీ చర్చలకు ఆస్కారం ఏర్పడేదనే భావన నెలకొంది.
అసలు అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బహిర్గతం చేయకపోవడం వెనుక ఏదో మతలబు ఉందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నివేదికను బయటపెట్టి చర్చలు సాగితే ఇంత రాద్దాంతం ఉండేది కాదు. వైవీ మంత్రుల కమిటీలో ఉంటే కనీసం తమ డిమాండ్లలో కొన్నయినా సీఎం జగన్తో ఒప్పించేవారని వాపోతున్నారు.
ఎక్కడ అణచివేత, అన్యాయం జరిగిందని జనం ముందుకొస్తారో అక్కడ కమ్యూనిస్టులుంటారు. అది సహజం. ఇప్పుడు వామపక్షాలను ఆడిపోసుకోవడం ద్వారా సమస్య పరిష్కారం కాదు. ఎవరైతే తమ సమస్యలకు చర్చల్లో పరిష్కారం చూపలేదని భావిస్తున్నారో వారితో ప్రభుత్వం మరోసారి చర్చించాలి.
ఈ చర్చలకు ప్రభుత్వ ప్రతినిధులుగా పోస్టుమ్యాన్లా వ్యవహరించేవాళ్లతో అయ్యేది కాదు. అటు సీఎం జగన్కు.. ఇటు ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలకు నచ్చజెప్పే ఓర్పు, నేర్పు కలిగిన వైవీ సుబ్బారెడ్డి లాంటి వాళ్లుండాలి. అప్పుడే ఉపాధ్యాయ, ఆర్టీసీ, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, పెన్షన్ దారుల ఆందోళనకు తెరపడుతుంది.