అద్భుతమైన కథాంశం.. మంచి నటన.. దర్శకత్వం.. నిర్మాణ విలువలు.. ఇవన్నీ ఉన్నా మన భారతీయ జై భీమ్ సినిమాకు ఆస్కార్ నామినేషన్లలో స్థానం దక్కలేదు. దీనిపై చాలామంది ఓ బాధ పడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక్కటే. భారతీయులు తీసిన ఒక అత్యుత్తమ చిత్రానికి వేరే దేశంలోవారి భాషలకు ఇచ్చుకునే సినిమావాళ్ల గుర్తింపు అవసరమా..? అది ఇంకా మన బానిసత్వ మనస్తత్వాన్ని సూచించడం లేదా..?
అవును. మన ఖ్యాతి అంతర్జాతీయంగా మారుమోగాలి. అలా కోరుకోవాలి. తప్పులేదు. అయితే వాళ్ల అవార్డుల్లో తుది జాబితాకు ఎంపికవ్వనంత మాత్రాన బాధపడిపోవాలా..? ప్రజాక్షేత్రంలో అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడి గెలిచి, నిలిచిన వాడు జస్టిస్ చంద్రు.
ఆయన జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలను సినిమా రూపంలో నటుడు సూర్య తెరకెక్కించారు. సూర్య ఓ సూపర్ స్టార్ అయి ఉండీ ఇలాంటి విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకోవడం గర్వించదగ్గది. స్వయంగా తానే నిర్మించారు. ఆయన నమ్మకం వృథాపోలేదు. జైభీమ్ ప్రజాదరణ, విమర్శకుల ప్రశంశల్నీ గెల్చుకుంది.
ముఖ్యంగా జనాల మనసులను గెలిచింది. వారి మదిలో కిరీటం పెట్టించుకున్న ఈ సినిమాకు ఆస్కార్ వస్తే.. అది ఆ కిరీటంలో ఒక కలికితురాయి అవుతుందంతే. అదే పెద్ద భూషణమేమీ కాదు. ప్రస్తుతం ఆస్కార్ లో ఉత్తమచిత్రాల విభాగాల్లో ఉన్న బెల్ ఫాస్ట్, కోడా, డోంట్ లుక్ అప్, డ్రైవ్ మై కార్, డూన్, కింగ్ రిచర్డ్, లిక్రోసో పిజ్జా, నైట్ మేర్ ఆల్లే, ద పవర్ ఆఫ్ ది డాగ్, వెస్ట్ సైడ్ స్టోరీ సినిమాల కంటే జైభీమ్ ఏమీ తీసిపోలేదు.
పైపెచ్చు వాటిలో కొన్నింటికంటే అత్యున్నత ఆశయంతో, విలువలతో తీసిన సినిమా ఇది. కాబట్టి మన సినిమాను వాడెవడో గుర్తించలేదని బాధపడడం అనవసరం. వాటిని మనం ఆదరించి ఇలాంటి మరిన్ని వైవిధ్యమైన సినిమాలను తీస్తే చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు.
ఈ సందేశాన్ని భారతీయ సినీరంగాలకు ఎలుగెత్తి చాటితే చాలు. ఆస్కార్ అనే పురస్కారం కూడా వెలకట్టలేని మరెన్నో అజరామర చిత్రాలు మన దేశంలో పురుడు పోసుకుంటాయి. కాదంటారా..!