కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. గతంలో నిత్యం పెరిగిన చమురు ధరలు స్థిరంగా ఉండటానికి బలమైన కారణం కూడా ఉంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వల్లే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం లేదు. ఎన్నికలు ముగిసిన వెంటనే పెరగడం ఖాయమని డెలాయిట్ ఇండియా ఎల్ఎల్పీ తెలిపింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు చమురు, గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి గూబ గుయ్యమంటుందనే !
అంతర్జాతీయంగా చమరు ధరల్లో జరిగే హెచ్చుతగ్గులకు అనుగుణంగానే దేశీయంగా ఈ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ధరల పెంపును ఈ సంస్థలన్నీ పక్కనపెట్టేశాయి. ప్రజల నుంచి వ్యతిరేకత ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందన్న కారణంతో ధరలు పెంచొద్దని కేంద్ర సర్కారు చమురు సంస్థలను ఆదేశించింది.
దీంతో ఈ సంస్థలన్నీ ధరల పెంపును తాత్కాలికంగా పక్కనపెట్టాయి. ఎన్నికలు ముగిసే వరకు ప్రభుత్వం చమురు ధరలను ముట్టుకోదని చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడతాయి. ఆ తర్వాత లీటరుపై 8 నుంచి 9 రూపాయల వరకు పెరగొచ్చని డెలాయిట్ ఇండియా ఎండీ శర్మ వెల్లడించారు.
నిత్యావసరాల ధరలకు మరిన్ని రెక్కలు..
ఒకవేళ పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగినా పన్ను రూపంలో ప్రభుత్వం ఎంతో కొంత తగ్గిస్తుందని, మిగిలిన భారాన్ని ప్రజలే మోయాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. పెట్రో ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. నిత్యావసరాల ధరలు చుక్కలు చూస్తాయి. అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధర 100 డాలర్లు దాటితే రిటైల్ ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటును అదుపు చేయడం భారత్కు సవాలే అవుతుంది. అలాగే చమురు ధరలు 10 డాలర్లు పెరిగితే దేశ వృద్ధిలో 0.3 నుంచి 0.35 శాతం మేర కోత పడుతుందని భావిస్తున్నారు.