దేశ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ప్రాణాలు తీస్తోంది. ఈ ఏడాది 25 వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు కేంద్రం వెల్లడించింది. ఇవి ప్రభుత్వ లెక్కలు. అసలు లెక్కకు రాని మరణాలెన్నో. ఇంత తీవ్రమైన సమస్యపై ఏపీలో నిరుద్యోగులు ఆందోళనకు సిద్దమయ్యారు. గురువారం కలెక్టరేట్ల ఎదుట నిరసనకు పిలుపునిచ్చారు. దాదాపు అన్ని యువజన సంఘాలు మద్దతినిచ్చాయి. ప్రభుత్వం యువజన సంఘాల నేతలను ఎక్కడకక్కడ నిర్బంధించారు. కొందర్ని నివాసాల్లో.. మరికొందర్ని లాడ్జిల్లో పెట్టారు. అయినా పోలీసులను తప్పించుకొని వచ్చి కలెక్టరేట్ల ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
సీఎం వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగాల భర్తీ గురించి స్పష్టంగా పేర్కొన్నారు. అందులో ఇప్పటిదాకా 1.35 లక్షల మంది సచివాలయ కార్యదర్శుల ఉద్యోగాలు కల్పించారు. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో 14 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అంతకుమించి ఏ శాఖలోనూ ఖాళీగా ఉన్న ఉద్యోగాల జోలికెళ్లలేదు.
ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రతీ ఏడాది జనవరిలో క్యాలెండర్ ప్రకటిస్తామని వైసీపీ హామీనిచ్చింది. ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయనే సమాచారం ఇవ్వాలని వైసీపీ అధికారానికి వచ్చాక ఒకటీ రెండు దఫాలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికీ ఏ శాఖ నుంచి పూర్తి సమాచారం ప్రభుత్వానికి చేరలేదు.
వైసీపీ అధికారానికి రాకముందే రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 2.38 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ వెల్లడించారు. ఏటా రెండు శాతం మంది ఉద్యోగులు రిటైర్ అవుతుంటారు. ఈ లెక్కన ఏటా 26 వేల మంది అనుకున్నా మూడేళ్లలో 78 వేల మంది రిటైర్ అయి ఉంటారు.
ఇప్పుడు సుమారు 3 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఏర్పడి ఉండొచ్చు. నిరుద్యోగుల ఆవేశాన్ని ప్రభుత్వం పోలీసులతో అణిచేయాలనుకుకోవడం అవివేకం. అణచివేత ఉద్యమాన్ని మరింత పెంచుతుంది. దీనిపై ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఓ ప్రకటన చేయాలి.
ప్రభుత్వ తీరు దారుణం
సీపీఐ రాష్ట్ర నాయకులు గుజ్జుల ఈశ్వరయ్య

ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చమని నిరుద్యోగులు అడుగుతుంటే పోలీసుల నిర్బంధాలతో అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టో తమకు భగవద్గీత, బైబిల్, ఖురాన్లాంటిదని సీఎం జగన్ చెబుతుంటారు. మరి ఉద్యోగాల భర్తీ గురించి ఎందుకు మాట్లాడడం లేదు ! పైగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల రిటైర్మెంటును 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు. ఈ వెట్టి చాకిరీ మేం చెయ్యలేమని ఉద్యోగులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇది చాలా దుర్మార్గం. మడమ తిప్పని.. మాట తప్పని నేత చేసే పనులేనా ఇవి ! ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం.