రాజ్యసభ రేసులో సినిమా నటులున్నారు. టాలీవుడ్ నుంచి ఒకరిని పెద్దల సభకు పంపించాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. సినిమా సమావేశానికి అలీని పిలవడంతో ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తారని భావిస్తున్నారు. శుక్రవారం ఏపీ మంత్రి పేర్ని నాని మోహన్ బాబును కలవడం మరింత ఆసక్తిగా మారింది. పేర్నినాని, మోహన్ బాబు సమావేశం తర్వాత రాజ్యసభ సీటు మోహన్ బాబుకేనన్న చర్చ కొన్ని వర్గాల్లో సాగుతోంది.
సినీ పరిశ్రమపై చర్చల అనంతరం అలీని వారం తర్వాత వచ్చి కలవాలని జగన్ సూచించారు. దీంతో అలీకి రాజ్యసభ సీటు ఇచ్చేందుకేనని ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరో మూడు నెలల తర్వాత ఏపీ నుంచి నలుగురు రాజ్యసభకు ఎంపిక కానున్నారు. ఇందులో ఒక సీటును మైనారిటీలకు కేటాయించాలని జగన్ నిర్ణయించినట్టు సమాచారం. అందువల్లే ఆ సీటును అలీకి కేటాయించాలని జగన్ చూచాయగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. గత ఎన్నికల్లో అలీ రాజమండ్రి టికెట్ ఆశించారు. సమీకరణాల దృష్ట్యా అవకాశం రాలేదు. అయినా వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో అలీ పాల్గొన్నారు.
జగన్ నిర్ణయాన్ని చెప్పడానికే మంత్రి నాని కలిశారా !
అలీని పెద్దల సభకు పంపించనున్నారనే చర్చ సాగుతుండగానే మోహన్ బాబు ఇంటికెళ్లి మంత్రి పేర్నినాని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మోహన్ బాబు గతంలో టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన వైసీపీ మద్దతుదారుగా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ కోసం ప్రచారం చేశారు. సీఎం జగన్ తో మోహన్ బాబుకు బంధుత్వం కూడా ఉంది. మోహన్ బాబును రాజ్యసభకు పంపాలనే జగన్ నిర్ణయాన్ని చెప్పడానికే పేర్నినాని మోహన్‌బాబును చర్చ జరుగుతోంది.
ఈసారైనా వైవీకి అవకాశం దక్కుతుందా !

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎప్పటి నుంచో రాజ్యసభ అడుగుతున్నారు. ఆయన ఎంపీగా చేసినప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రజాభిమానం పొందారు. కేంద్రం నుంచి నిధులు సాధించడంలో ఎంతో చొరవ చూపారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో కొన్ని రాజకీయ సమీకరణల వల్ల ఆయనకు ఎంపీగా అవకాశం దక్కలేదు. ఆ అసంతృప్తి వైవీలో అలాగే ఉంది. అనేక దఫాలు తనను రాజ్యసభకు పంపాలని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా ప్రయోజనం లేకపోయింది. త్వరలో ఖాళీ అయ్యే నాలుగింటిలోనైనా అవకాశం దక్కుతుందా లేదనేది వైసీపీలో చర్చనీయాంశమైంది.