ప్రధాని నరేంద్ర మోడీ ఎత్తుగడ సగమే పారింది. మిగతా సగం తుస్సుమంది. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అసంబద్ధంగా జరిగింది. అందువల్లే రెండు రాష్ట్రాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి.’అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పెద్ద ఎత్తున దుమారం రేపాయి. అప్పటికే సీఎం కేసీఆర్ మోడీని తూర్పారబడుతున్నారు. దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ వ్యాఖ్యలు కొంత తోడ్పడ్డాయి.
అదే ఏపీలో మోడీపై జనం నిప్పులు చెరిగారు. విభజన బిల్లు పాసవ్వడానికి కారకులు బీజేపీనే. నాడు రాజ్యసభలో కాంగ్రెస్కు బిల్లును నెగ్గించుకునే బలం లేదు. ఇది ప్రజలకు తెలుసు. అందుకే కమలనాధులు ఏపీలో మరింత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు.
మోడీ అలా మట్లాడారో లేదో వెంటనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లైన్లోకి వచ్చింది. విభజన హామీలు, రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలతోపాటు ఏపీకి ప్రత్యేక హోదా గురించి చర్చించించేందుకు నిన్న ఉదయం త్రిసభ్య కమిటీని వేసింది. దీంతో వైసీపీ ఎంపీలు, సీఎం జగన్ కృషి వల్లే ఇది సాధ్యమైందని ఆ పార్టీ మీడియా ఊదరగొట్టింది.
సాయంత్రానికల్లా అజెండాలో హోదాను తీసి పక్కన పెట్టేశారు. 9 అంశాలు కాస్తా నాలుగు అంశాలకే పరిమితమైంది. టీడీపీ, ఆ పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీల కుట్ర వల్లే హోదా అంశాన్ని తప్పించినట్లు వైసీపీ శ్రేణులు లంకించుకున్నాయి
వైసీపీకి 23 మంది ఎంపీలున్నారు. టీడీపీకి ఉన్నది ముగ్గురే. 23 మంది అడిగితే కేంద్రం స్పందించలేదు. ఇప్పుడు కేంద్రం హోదాపై చర్చిద్దామంటే ముగ్గురు ఎంపీలు ఎలా అడ్డుకోగలుగుతారని టీడీపీ కౌంటర్ ఎటాక్ చేస్తోంది. ఇంతకీ ఉదయం అజెండాలో పెట్టిన అంశాలను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో బీజేపీ చెప్పదు. అడిగే దమ్ము వైసీపీకి లేదు. టీడీపీకి అంతకన్నా లేదు. జనసేన మిత్ర పక్షం అయినందున ఎలాగూ అడగదు. వామపక్షాలు మాత్రమే ఇది కమలనాధుల దగాకోరుతనానికి నిదర్శనమంటూ కన్నెర్రజేస్తున్నాయి.
అసలు ఇంత రాద్దాంతం ఎందుకు మోడీజీ ! మీకు ఇన్ని తోక పార్టీలు అవసరమా ! ప్రత్యేక హోదా ఇచ్చేయండి. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయండి. కడపలో స్టీల్ ప్లాంటు పెట్టండి. విశాఖ స్టీలు ప్లాంటు విక్రయం నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి. రెవెన్యూ లోటు తీర్చండి. ఇంకా విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చి ఓట్లు అడిగితే.. కమలానికి తప్పితే మరెవరికి వేస్తారని జనం అంటున్నారు. ఇవన్నీ మీరు చేస్తే బీజేపీకి ఓ అవకాశం ఇద్దామనే ఆలోచన ప్రజల్లో రావొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మోడీజీ !