‘సార్ ! బిగ్ బ్రేకింగ్ న్యూస్ !
ప్రకాశం జిల్లా అద్దంకిలో ఇద్దరు వేశ్యలు అరెస్టు.
మంగలి షాపులో వ్యభిచారాన్ని గుట్టురట్టు చేసిన పోలీసులు!’
అంటూ ఆ విలేకరి అత్యుత్సాహంతో ఇంకా ఏదేదో చెబుతున్నాడు.
తాను మళ్లీ చేస్తానని చంద్ర కాల్ కట్ చేశాడు.
చంద్ర బస్సులో ఉన్నాడు.
పక్క సీట్లో ఓ పెద్దాయన ఉన్నాడు.
ఫోన్ సంభాషణను ఆసక్తిగా గమనిస్తున్నాడు.
కండక్టర్ వచ్చి టిక్కెట్ ఇచ్చాడు.
చంద్ర ఫోన్ తీసి విలేకరికి కాల్ చేశాడు.
‘ఇలాంటి పనికిమాలిన వార్తలొద్దు.
వీలైతే వాళ్లు ఏ పరిస్థితుల్లో
ఈ దుస్థితికి దిగజారాల్సి వచ్చిందో శోధించు.
గ్రామాల్లో పనుల్లేవ్. కూలీలు అల్లాడుతున్నారు.
పంటలు దెబ్బతిన్నాయ్.
రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఆడవాళ్ల నగలు తాకట్టులోనే ఉన్నాయి.
కౌలు రైతులు చితికిపోయారు.
కుటుంబాలు గడిచే మార్గం లేక..
గత్యంతరం లేని దుర్భర స్థితిలో ఈ పనికి పాల్పడి ఉండొచ్చు.
సమగ్ర సమాచారంతో వాళ్లు పేర్లు మార్చేసి స్టోరీ ఇవ్వు !’
అంటూ చంద్ర గుక్క తిప్పుకోకుండా చెప్పాడు.
‘ముండలు కొవ్వెక్కి బలిసి కొట్టుకుంటున్నారు !
లేకుంటే ఇవేం పనులు !
పోలీసులు గట్టిగా శిక్ష పడేట్లు చూడాలి.
మరోసారి ఇలాంటి పనికి పాల్పడకుండా తగిన శాస్తి చేయాలి’
అంటూ పక్కనున్న పెద్దాయన ఏదేదో గొణుగుతూనే ఉన్నాడు.
ఆయన మాటలకు చంద్రకు చిర్రెత్తుకొచ్చింది.
చంద్ర తమాయించుకొని ఆయనతో మాటలు కలిపాడు.
ఆయనో మోతుబరి రైతు. పదెకరాలుంది.
కొడుకు అమెరికాలో.. కూతురు బెంగళూరులో ఉంటారు.
ఇద్దరికీ పెళ్లిళ్లు చేశాడు. వాళ్లు అక్కడే సెటిలయ్యారు.
వ్యవసాయం చేసేవాళ్లు లేక పొలం కౌలుకిస్తుంటాడు.
కౌలు సక్రమంగా ఇవ్వడం లేదని అసహనం ప్రదర్శించాడు.
ఆడవాళ్లు గడప దాటి బయటకెళ్తే
ఇలాగే ఉంటుందని సూత్రీకరించాడు.
ఇంకా అలగా జనం ఇంతేనంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు.
చంద్ర ఇక తమాయించుకోలేక పోయాడు.
ఇంకో ఐదు కిలోమీటర్లు వెళ్తే
తాను దిగాల్సిన స్టేజి వస్తుంది.
చంద్ర పైకి లేచాడు.
పక్కసీట్లోని పెద్దాయన వంక చూస్తూ..
‘మీ కూతురు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా
సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఎలా అయ్యింది !
బయటకు వెళ్లి చదువుకోకుండానే నీ కోడలు డాక్టరయిందా !
ఆ పదెకరాల భూమి లేకుంటే
మీరే పరిస్థితుల్లో ఉండేవాళ్లో ఊహించుకోండి.
మీ తాత ముత్తాతలేమన్నా భూమిని తయారు చేశారా !
మీలాంటి వాళ్లే అవనికి భారం.
ఇంకా బతికి ఏం సాధించాలని.
మీరెంత తొందరగా చచ్చిపోతే అంత మంచిది!’
అంటూ చంద్ర వెనుదిరిగి చూడకుండా వెళ్లాడు.
బస్సులో ప్రయాణికులంతా అవాక్కయ్యారు.
ఆ పెద్దాయన అటుఇటు చూసి తలదించుకున్నాడు.
– ఓ వాస్తవ ఘటనకు ప్రతి రూపం ఈ కథానిక