తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్నా అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ జోరుగా జనంలోకి వెళుతున్నాయి. ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఇచ్చిన ఓ నినాదం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాటలో రేవంత్ రెడ్టి వెళుతున్నట్లు కనిపిస్తోంది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మోహన్‌రెడ్డి తెలుగు దేశంపై గెలిచేందుకు ఎన్నో నినాదాలు అందుకొన్నారు. నవరత్నాలు, రావాలి జగన్.. కావాలి జగన్ అంటూ విపరీతంగా ప్రచారం చేశారు. వీటిల్లో జగన్‌కు కలిసొచ్చిన స్లోగన్ బైబై బాబు. ఈ నినాదం ప్రభుత్వ వ్యతిరేతను, టీడీపీ పాలనా వైఫల్యాలను చూపడం మంచి ఫలితాన్నిచ్చింది.
వైసీపీ సోషల్ మీడియాలో, జగన్ ప్రసంగాల్లో బైబై బాబు అనే మాట ఎక్కువగా వినపడేది. ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి కూడా జగన్ దారిలోనే పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ ను విమర్శిస్తూ రేవంత్ రెడ్డి బైబై కేసీఆర్ అంటూ ట్వీట్ చేశారు.
రాజ్యసభలో మోడీ ప్రసంగానికి టీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి. ఈ ఘటన అనంతరం జనగాంలో కేసీఆర్ సభ జరిగింది. ఆ సభలో విపక్షాలపై కేసీఆర్ విరుచుకుపడ్డారు. దీనిపై రేవంత్ రెడ్డి కేసీఆర్ కు కౌంటరిచ్చారు. తెలంగాణ అస్థిత్వాన్ని ప్రశ్నించిన మోడీని ప్రశ్నించడానికి కేసీఆర్ కు అంత భయమెందుకు అంటూ ట్వీట్ చేశారు.
అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని అవమానిస్తుంటే.. నికార్సైన తెలంగాణ బిడ్డ ఎవరైనా పౌరుషంతో తిరగబడతారు. జనగాం ప్రసంగం తర్వాత ‘కేసీఆర్ ఖేల్ ఖతం’ అన్న విషయం అర్థమైందంటూ ట్వీట్ చేశారు. ట్వీట్కింద బైబై కేసీఆర్ అని పేర్కొన్నారు.
ఆంధ్రలో జగన్ అధికారంలోకి రావడానికి ఉపయోగించిన బైబై ట్యాగ్‌ను రేవంత్ రెడ్డి వాడడం చర్చనీయాంశమైంది. ఇక్కడ మరో సారుప్యత కూడా ఉంది. చంద్రబాబుపై జగన్ బైబై బాబు ట్యాగ్ వాడినప్పుడు చంద్ర బాబు కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా మోడీపై తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫార్ములా తెలంగాణలో పని చేస్తుందా లేదా అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేమంటున్నారు విశ్లేషకులు.