మనం బతికేదే బతుక్కాదు.
మన చుట్టూ ఉన్న ప్రపంచం ఆనందంగా ఉంటేనే
మనం సంతోషంగా ఉండగలుగుతాం.
వీలైనంత తోటి వారికి సాయం చేద్దాం.
ఆపదలో భుజం ఆనించి భరోసానిద్దాం.
ఆవేదనను పాలుపంచుకుందాం.
మేమున్నామనే ఓ మనో నిబ్బరాన్నిద్దాం.
ఇలాంటి ఆలోచనలు.. అభిప్రాయాలతో
‘మమతల పందిరి’అల్లుకుంది.
ఫేస్ బుక్ గ్రూపులెన్నో.
టైంపాస్‌కు నడిపేవాళ్లు కొందరు.
రాజకీయ లక్ష్యాలతో నడిచేవి మరికొన్ని.
సామాజిక అసమానతలపై ఇంకొన్ని..
ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరి అభిరుచులకు
తగ్గట్టు వాళ్ల గ్రూపులుంటాయి. వీటికి భిన్నంగా ‘మమతల పందిరి’ వేళ్లూనుకుంది.

ఆరు నెలల తర్వాత అంతా ఒకచోట చేరారు.
కృష్ణా జిల్లా వీరవల్లి గ్రామంలో కలిశారు.
గ్రూపు అడ్మిన్ రమేష్ కృషి ఫలించింది.
ఏపీతోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్నాటక..
మహారాష్ట్ర నుంచి ఇందులో సభ్యులున్నారు.
సుమారు 250 మంది హాజరయ్యారు.
ఇప్పటిదాకా ఏం చేశాం..
భవిష్యత్తులో ఇంకా ఏమేం చేయొచ్చు..
అందుకు ఎవరెవరు ఏమేరకు సాయం అందిస్తారు..
ఎవరు బాధ్యత తీసుకోవాలి.. ఇలా
వాళ్ల మధ్య చర్చలు సాగాయి.
మున్ముందు మరింత మంది సభ్యులతో
గ్రూపును విస్తరించాలని ఆకాంక్షించారు.
అప్పటిదాకా కేవలం పోస్టుల ద్వారానే
ఒకరినొకరు భావాలను పంచుకున్నారు.
ఇప్పుడు ఒక్కసారిగా ఎదురు పడ్డారు.
ఆప్యాయంగా పలకరించుకున్నారు.
ఎన్నో భావాలను పంచుకున్నారు.
మరెన్నో ఆలోచనలకు పురుడు పోశారు.
మరింత దగ్గరయ్యారు.
ఈ ‘మమతల పందిరి’మరింతగా అల్లుకుపోవాలని కాంక్షిస్తూ..