రాహుల్ గాంధీ పుట్టుకను కించపరుస్తూ అస్సాం బీజేపీ సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. బీజేపీ.. ఇదేనా నీ సంస్కారం? రాహుల్ గాంధీని అంత మాట అనొచ్చా? అని తిట్టిపోశారు. అంతేనా.. రాహుల్ పూర్వీకులు దేశం కోసం ఎన్నెన్నో త్యాగాలు చేశారు.. రాహుల్ ముత్తాత స్వాతంత్ర్యం కోసం జైలు శిక్ష అనుభవించారు.. నానమ్మ తండ్రి కూడా దేశం కోసం జరిగే పనిలో ప్రాణాలు కోల్పోయారని కేసీఆర్ గుర్తుచేశారు. ఏ నోటితోనైతే రాహుల్ ను బఫూన్ అన్నారో.. అదే నోటితో పబ్లిక్ మీటింగ్ లో అతనికి ప్రేమపూర్వక తోడ్పాటును ప్రకటించారు కేసీఆర్.
రాహుల్ గాంధీకి కేసీఆర్ సమర్థన తర్వాత బీజేపీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ మిలాఖత్ అయిందని కమలదళం ఆరోపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఒటరిగా ఎదుర్కొనే సత్తాలేక కేసీఆర్ కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారని విమర్శిస్తోంది. మొన్నటిదాకా కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ అని హడావుడి చేసిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ తో దోస్తీకి తహతహలాడుతోన్నట్లు తేటతెల్లమైందని కాషాయనేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
రాహుల్ గాంధీని సమర్థిస్తే వచ్చే విమర్శలు ఎలా ఉంటాయో తెలిసే కేసీఆర్ ఎందుకు ప్రేమ ప్రదర్శించారు అనేది ప్రస్తుతం తెలంగాణ సమాజంలో చర్చనీయాంశమైంది. కొంతకాలంగా కేసీఆర్.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రత్యర్థి బీజేపీనే అనే అభిప్రాయం అందరిలో నాటుకుపోయేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీని సోయిలో లేకుండా చేయడానికే కేసీఆర్ బీజేపీతో లేని గొడవలు సృష్టించుకుంటున్నాడని, వాస్తవానికి బీజేపీ-టీఆర్ఎస్ ఒకే ఐడియాలజీతో పనిచేస్తున్నాయని, రాజ్యాంగాన్ని తొలగించడ మొదలు హిందూత్వ అజెండాను అమలు చేయడంతో కమల దళం-గులాబీ సైన్యం ఒకే తీరుగా వ్యవహరిస్తున్నాయిని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
రాహుల్ గాంధీకి మద్దతుగా కేసీఆర్ వ్యాఖ్యల తర్వాత తెలంగాణ నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చలు, కామెంట్లు వెల్లువెత్తాయి. అసలైన ప్రత్యర్థి కాంగ్రెస్ ను ఏమార్చడానికే కేసీఆర్ ఇలా కామెంటు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఇదే కేసీఆర్ రాహుల్ గాంధీ, నెహ్రూ ఫ్యామిలీపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని కొందరు గుర్తు చేస్తున్నారు.
అస్సాం బీజేపీ సీఎం వ్యాఖ్యలు మరీ దారుణంగా ఉన్నాయి. వాటిపై స్పందించడానికి మానవత్వం సరిపోతుంది. కేసీఆర్ ప్రదర్శించింది ఆ మానవత్వాన్నే అని మరికొందరు కామెంట్లు పెట్టారు. మొత్తంగా కాంగ్రెస్ పట్ల సానుకూలత.. బీజేపీ పట్ల వ్యతిరేకత చాటుకోవడం ద్వారా కేసీఆర్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో కూడిన ప్రత్యామ్నాయానికి సిద్ధమన్న సంకేతాలు వెల్లడించారు.