తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర సర్కార్ పై గులాబీ బాస్ వీర లెవల్లో దండెత్తుతున్నారు. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ కమలనాధులపై నిప్పులు చెరుగుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ విషయంలో సాఫ్ట్ గా వెళుతున్నారు. గతంలో కాంగ్రెస్ కథ అయిపోయిందన్నారు. ఇప్పుడు మాత్రం ఆ పార్టీని సమర్ధిస్తూ మాట్లాడుతున్నారు. కేసీఆర్ తాజా వైఖరి తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గీయుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
బీజేపీ, టీఆర్ఎస్ దొందూదొందేనని కొంత కాలంగా కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ తోడుదొంగలనేది బీజేపీ ఆరోపిస్తోంది. రాహుల్‌గాంధీపై అసోం సీఎం చేసిన అసంబద్ధ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు చేయాలిగానీ, మరీ ఇంత నీచంగా వ్యక్తిగతంగా దిగజారుడు మాటలు మాట్లాడమేంటని బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై సాక్షాలు చూపాలంటూ రాహుల్‌గాంధీ చేసిన డిమాండ్‌నూ సపోర్ట్ చేశారు. రఫేల్ డీల్‌లో భారీ అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్‌లానే తామూ బీజేపీ అవినీతిపై పోరాడుతామని చెప్పారు కేసీఆర్.
ప్రెస్మీట్లో కేసీఆర్ బీజేపీని ఎంతగా విమర్శించారో.. కాంగ్రెస్‌నూ అంతగా సమర్ధించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. కేంద్రంలో బీజేపీని గద్దె దించాల్సిన అవసరం ఉందంటూ.. బీజేపీ లేని దేశం కావాలంటూ.. నినదించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటారా? అని మీడియా ప్రతినిధులు కేసీఆర్‌ను ప్రశ్నించగా.. కాంగ్రెస్‌తో పొత్తును ఏమాత్రం ఖండించలేదు కేసీఆర్. బీజేపీని తరిమికొట్టడానికి అంతా కలవాల్సిన అవసరం ఉందన్నారు.
పొత్తులు అనేవి తర్వాత నిర్ణయం.. ఇప్పుడే దాన్ని ఎవరూ ఊహించలేరు.. ఎవరు ఎవరిని కలుస్తారో.. జరిగేదేదో జరుగుద్ది.. ముందైతే బీజేపీని గద్దె దించాల్సిందే.. అంటూ కేసీఆర్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా నేరుగా కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని చెప్పకున్నా.. అవసరమైతే, బీజేపీని దెబ్బకొట్టేందుకు భవిష్యత్తులో కలిసి పనిచేసే ఛాన్స్ ఉందన్నట్టు గులాబీ బాస్ మాట్లాడారు.
కేసీఆర్ వ్యాఖ్యలు అందరికంటే తెలంగాణ కాంగ్రెస్‌కు, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి ఇబ్బంది తెచ్చిపెట్టేవే అంటున్నారు. ఈ రెండు పార్టీలు జట్టు కట్టబోతున్నాయనే మెసేజ్ ప్రజల్లోకి వెళితే.. అది కాంగ్రెస్‌కు బిగ్ మైనస్. అదే టైమ్‌లో బీజేపీకి ప్లస్ అవుతుంది. నిజంగా భవిష్యత్తులో ఎన్నికల తర్వాత బీజేపీని గద్దెదించేందుకు కేసీఆర్ కాంగ్రెస్‌తో జట్టు కడితే అది రేవంత్‌రెడ్డికి మరింత షాక్.
కేసీఆర్‌ను ఒక్కరోజైనా జైల్లో పెట్టాలనే కసితో కొట్లాడుతున్నారు రేవంత్‌రెడ్డి. అలాంటిది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ తో కలిసిపోతే రేవంత్ రెడ్డి పని చేస్తారా అనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ టార్గెట్ గానే రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ తో కలిసి పనిచేయడం అసాధ్యమనే వాదన వస్తోంది. అలాంటి పరిస్థితి వస్తే రేవంత్ రెడ్డి కచ్చితంగా తన దారి తాను చూసుకుంటారనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది.