మంచు మోహన్ బాబు అంటేనే ముక్కుసూటి మనిషి.. డిప్లొమసీ ఏమాత్రం తెలియని వ్యక్తి అని ఇండస్ట్రీలో అంటుంటారు. అందువల్లే ఆయనతో పాటు మంచు కుటుంబం కూడా పలుమార్లు నెట్టింట ట్రోలింగ్ కు గురవుతుంటుంది. అప్పుడెప్పుడో గుండెల్లో గోదారి సినిమా ఫంక్షన్లో తన కుమార్తె మంచు లక్ష్మికి ఆస్కార్ అవార్డు దక్కాలన్న వ్యాఖ్యలు నేటికీ ఏదో ఒక ట్రోలింగ్ వీడియోలో దర్శనమిస్తూనే ఉంటాయి. అలాగే రాజ్ దీప్ సర్దేశాయ్ తో ఇంటర్వ్యూలో ఆయన వాడిన ఫసక్ అన్న పదం ఎంతగా పాపులర్ అయిందో చూశాం.
ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా మంచు విష్ణు కూడా ట్రోలర్లకు మంచి ఫీడ్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా ఆయన ‘టంగుటూరి వీరేహం పకాహం పంతులు’ అన్న పదం విపరీతంగా సర్క్యులేట్ అయింది. తాజాగా మరోసారి మంచు మోహన్ బాబు ట్రోలర్లకు చిక్కారు.
ఇటీవల కలెక్షన్ కింగ్ హీరోగా నటించిన సన్నాఫ్ ఇండియా అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో దర్శకుడు మోహన్ బాబుకు నమస్కారం పెట్టారు. ‘నువ్వు నా కాళ్లకు నమస్కారం పెట్టాలని చూస్తున్నావు. అలాంటివేమీ చెయ్యకు. నాకు అలాంటివి నచ్చవు’ అంటూ మోహన్ బాబు అతన్ని వారించారు.
ఇదే ఇప్పుడు అందరికీ టాకింగ్ పాయింట్ గా మారింది. కాళ్లమీద పడొద్దు అంటూనే ఇండైరెక్ట్ గా తన కాళ్ల మీద పడి నమస్కారం పెట్టమని మోహన్ బాబు సూచించారంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. వాస్తవంగా దర్శకుడు డైమండ్ రత్నబాబు మోహన్ బాబు కాళ్లవైపు చూడటం వీడియోలో కనిపిస్తోంది.
మోహన్ బాబు ఎక్కడ దొరుకుతారా అని చూసే ట్రోలర్లు అవన్నీ ఎందుకు పట్టించుకుంటారు? దొరికిందే అవకాశంగా వివిధ రకాల మీమ్స్ తో చెలరేగిపోయారు. ఎంత ట్రోలింగ్ జరిగినా.. దాన్ని చాలా స్పోర్టివ్ గా తీసుకున్న మంచు కుటుంబాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.