విద్యార్థులు కూర్చుకునేందుకు కుర్చీలు.. బల్లలుండవు. వాష్ రూముల్లోకి వెళ్లాలంటే వాంతొస్తుంది. సరైన నీటి సదుపాయం ఉండదు. ల్యాబులు కాగితాలకే పరిమితం. చుక్కాణి వేసినా కనిపించవు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంటు రావడం లేటయితే రాద్దాంతం చేస్తారు. ప్రభుత్వం చెల్లించేదానికి అదనంగా రకరకాల పేర్లతో విద్యార్థుల నుంచి డబ్బు గుంజుతున్నారు. అయినా పట్టించుకునే నాథుడు లేడు. ఆయా అనుబంధ యూనివర్శిటీలు కాలేజీల వైపు కన్నెత్తి కూడా చూడవు. అసలు వీటిని ఇంజనీరింగ్ కాలేజీలంటారా అని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 350 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. అందులో దాదాపు 150 కళాశాలల్లో సదుపాయాలు అంతంత మాత్రమే. మరీ ఓ యాభై కాలేజీలు మాత్రం భవనాలే కనిపిస్తాయి. అంతకుమించి ఎలాంటి సౌకర్యాలుండవు. ఇక్కడ పనిచేసే అధ్యాపకుల పరిస్థితి మరీ దారుణం. నెలకు పది నుంచి పదిహేను వేలు మాత్రమే వేతనంగా ఇస్తారు. ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం రూ. 40 వేల నుంచి ప్రారంభ వేతనం ఉండాలి. అసలు ట్విస్ట్ ఏమిటంటే అధ్యాపకులకు అంతే వేతనం బ్యాంకు ఖాతాలో వేసి మళ్లీ తిరిగి తీసుకుంటారట. ఇంతకన్నా దారుణ: ఏమైనా ఉంటుందా ?
ఈ కళాశాలల్లో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ ఇదేమిటని నిలదీసే పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే.. వాళ్లిక అక్కడ ఉద్యోగం చేయలేరు. విపరీతమైన పని భారం మోపుతారు. అడ్డమైన పనులు అప్పగిస్తారు. అవమానిస్తారు. చివరకు తనంత తానుగా ఉద్యోగం వదిలిపోయేట్లు చేస్తారు.
విద్యార్థుల పరిస్థితీ అంతే. సరైన సౌకర్యాల్లేవని అడిగినా.. ల్యాబులేవని ప్రశ్నించినా.. అదనంగా ఫీజులు ఎందుకు చెల్లించాలని నిలదీసినా ఇక అంతే సంగతులు. వాళ్లకు ల్యాబుల్లో మార్కులు దిగకోసేస్తారు. తరగతి గదుల్లో విద్యార్థులందరి ముందు అవమానాలకు గురిచేస్తారు. మానసికంగా వేధిస్తారు. చివరకు కాలేజీ నుంచి పారిపోయేట్లు చేస్తారు. ఈ భయానికి విద్యార్థులూ నోరు మెదపలేరు.
ఇంత దయనీయ పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వాల్లో స్పందన లేదు. సాంకేతిక విద్యాశాఖ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తారు. యాజమాన్యాలు ఇచ్చే ముడుపులు దండుకొని వెళ్లిపోతారు. కనీసం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పట్టించుకోరు. ఇంజనీరింగ్ కాలేజీలు నడిపేవాళ్లంతా రాజకీయ నాయకులకు దగ్గరగా ఉంటారు. అందువల్ల వీళ్లూ పట్టించుకోరు. చివరకు యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను కూడా భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఇక వీళ్ల అకృత్యాలను ఆపేది ఎవరు !
శానిటైజరుకూ నగదు వసూలు చేస్తున్నారు
– డాక్టరు ఎంవీ బ్రహ్మానందరెడ్డి,
APTPIEA అధ్యక్షుడు

సంతలో కూరగాయలు బేరమాడినట్లు వేతనాలు ఇస్తారు. ఇంజనీరింగ్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్, పీహెచ్డీ చేసిన వాళ్లు గత్యంతరం లేక పదివేలకు పనిచేస్తున్నారు. ప్రతీనెలా ఒకటో తేదీన జీతం ఇవ్వరు. ఒకసారి ఐదో తేదీ ఇస్తే ఇంకోసారి పదో తేదీ, 20వ తేదీన ఇస్తారు. కరోనాతో ప్రాణాలు పోయినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఆన్లైన్ క్లాసులు సక్రమంగా జరగక ఇప్పటికీ సగం సిలబస్ కూడా కాలేదు. రేపు విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు ! ఏఐసీటీఈకి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా స్పందించడం లేదు. యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం లేదు. విద్యార్థుల ఫీజులు చెల్లించే ప్రభుత్వాలైనా పట్టించుకోవాలి కదా !