మెగాభిమానులకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఆ చిక్కుతో ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి అభిమానుల్లో చాలామంది పవన్ కళ్యాణ్ ను కూడా అభిమానిస్తారు. పవన్ కు ప్రత్యేకంగా ఉన్న ఫ్యాన్ బేస్ గురించి అలా ఉంచితే.. అన్నదమ్ములిద్దరినీ సమానంగా అభిమానించే కొన్ని కోట్లాది మంది ఫ్యాన్స్ వీళ్లిద్దరి మధ్యలో నలిగిపోతున్నారు.
ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, అనంతరం దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పనిచేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉన్నారో లేదో ఎవరికీ తెలియని పరిస్థితి. ఉన్నారనుకుంటే కాంగ్రెస్ కు సంబంధించి ఏ కార్యక్రమాల్లోనూ ఆయన ఊసు లేదు. పోనీ పార్టీలో లేరు అనుకుందామంటే.. ఆయన తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. ఏపీలో జగన్ సర్కారు ఏర్పడిన తర్వాత ఆ పార్టీకి, జగన్ కు ఆయన చాలా సన్నిహితంగా వ్యవహరిస్తున్నారన్నదానిలో మాత్రం ఎటువంటి సందేహం లేదు.
ప్రచారంలో ఉన్నట్లుగా ఆయన వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీగా వెళ్తారో లేదో తెలీదు. జగన్ చేసే ప్రతి పనికీ తన మద్దతును కచ్చితంగా ఇస్తున్నారు. జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి ఆయన మద్దతు పలికారు. కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ట్విటర్ లో జైకొడుతూ వచ్చారు. అప్పుడప్పుడూ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం విషయంలో జగన్ ను కలుస్తూ వీలైనంత వినయంగా వ్యవహరిస్తున్నారు.
మరోవైపు జగన్ అండ్ కో ను చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. వారిపై ఎప్పుడు వీలు చిక్కినా విరుచుకుపడుతున్నారు. సినీ ఇండస్ట్రీ సమస్యల విషయంలో పవన్ ఏ స్థాయిలో స్పందించారో తెలిసిందే. ఇటీవల చర్చల్లో చిరు పూర్తిగా వంగిపోయి నమస్కారాలు పెట్టడమే కాదు. ట్విటర్ లోనూ జగన్ ను ఆకాశానికెత్తేశారు. ఏకంగా థ్యాంక్యూ శ్రీ జగన్ అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేసే ప్రయత్నం చేశారు. ఓరకంగా జనసేనానిని ఎదుర్కొనేందుకు వైసీపీ శ్రేణులకు చిరంజీవే ఆయుధంగా మారుతున్నారనేది పరిశీలకుల మాట.
చిరు వ్యక్తిగత ప్రయత్నాలు అటు పవన్ కు కూడా రాజకీయంగా ఇబ్బందిని కలిగిస్తున్నాయని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా జగన్ తో భేటీ తాలూకు వీడియో చూసి పవన్ ఉద్వేగానికి లోనయ్యారని సమాచారం. తన అన్నయ్యపై ఎప్పుడూ మాట పడనివ్వలేదట.
ఇప్పుడు ఆయన ఏకంగా తన ప్రత్యర్థి ఎదుట చేతులు జోడించి ప్రార్ధించడమేంటంటూ పవన్ తీవ్ర ఆవేదనకు లోనైనట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద అన్నదమ్ముల్లో ఎవరికి అండగా నిలబడాలన్నదానిపై మెగాభిమానులు.. వారి సామాజిక వర్గీయులు తలలు పట్టుకుంటున్నారు.