‘ప్రాజెక్టులు కొట్టకపోయినయ్. వాగులు పొంగినయ్. యాడ జూసినా కరవే. పిల్లాజెల్లను ఎక్కదీసుకునేందుకు యాడకు పోవాలో..ఏమో. గవరమెంటు ఆ నాలుగు రోజులు తింటానికి ఇచ్చినారు. ఆడ నుంచి బతికేదెట్టా సామె. పంటలు బోయినయ్. పనుల్లేవ్. బతుకుదెరువుకు ఆడ బిడ్డలూ కువైట్ పోతా ఉండారు. మా కష్టాలు ఎన్నటికి తీరుతాయ్ సామె. బడితెన్నోడిదే రాజ్యమై పోలా. ఇంకేందీ బతికేది !’అంటూ కడప జిల్లా కోడూరుకు చెందిన ఓ పెద్దాయన నిట్టూర్చాడు.
నాలుగు నెలల క్రితం భారీ వర్షాలకు, వరదలకు రాయలసీమలోని కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ప్రజలను కడు నిరుపేదలుగా మార్చేశాయి. రైతు.. కూలీ సర్వం కోల్పోయారు. చిరుద్యోగులు, చిరు వ్యాపారులు చితికిపోయారు. ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగా సాయం అందించింది.
కుటుంబాలు గడవక పేదలు పొట్ట చేతబట్టుకొని వలసలు పోతున్నారు. ఆడబిడ్డలు కూడా కొంపాగోడు తెగనమ్మి కువైట్, సౌదీకి వెళ్తున్నారు. కన్నబిడ్డలను ముసలోళ్ల దగ్గర వదిలేసి కడుపు తీపికి దూరంగా బెంగళూరులాంటి నగరాలకు కన్నీటి ప్రయాణం చేస్తున్నారు.
అధికార పార్టీని అడ్డుపెట్టుకున్న రాజకీయ నేతలు మాత్రం ఇసుక, మైనింగ్ మాఫియా అవతారమెత్తారు. ఇష్టారాజ్యంగా సహజ వనరులను దోచేస్తున్నారు. దొరికిన కాడికి భూములు ఆక్రమిస్తున్నారు. అడిగే వాళ్లు లేరు. ఇక వాళ్ల అక్రమాలకు అడ్డేముంటుంది !
సీమ జిల్లాల్లో కొనసాగుతున్న దోపిడీ సీపీఐ సమర శంఖం పూరించింది. సోమవారం నుంచి ఆయా జిల్లాల్లో పార్టీ యంత్రాంగం పర్యటనకు సిద్ధమైంది. ప్రజలను సమీకరించి ఈ దురాగతాలపై గొంతు విప్పుతోంది. ఈనెల 18 వరకూ సీమ జిల్లాలన్నింటిలో పర్యటిస్తుంది. 24న ప్రజా సమస్యలపై అనంతపురంలో సదస్సు నిర్వహించనుంది.
రైతులను ఆదుకోవాలి
–గుజ్జుల ఈశ్వరయ్య
సీపీఐ కడప జిల్లా కార్యదర్శి

నవంబరులో భారీ వర్షాలు, వరదల భీభత్సం నుంచి రైతులు ఇంకా కోలుకోలేదు. పంటలు కొట్టుకుపోతే పరిహారం ఇచ్చింది లేదు. గేదెలు వరదలో పోయాయి. ఇంట్లో సామగ్రి సైతం నీళ్లపాలైంది. దాచుకున్న తిండి గింజలూ లేవు. రైతులు.. కూలీలు ఎలా బతకాలి ! ప్రభుత్వం కంటి తుడపు చర్యలతో సరిపెట్టింది. ఇప్పటికైనా ప్రజల అవస్థలు గమనించి ప్రభుత్వం సాయం అందించాలి. శనగ పంటను రూ.8 వేల ధరతో కొనుగోలు చేయాలి. పసుపు రూ.10 వేలు, అరటి రూ.15 వేల ధరలతో కొనుగోలు చేస్తేనే రైతులకు పెట్టుబడులు వస్తాయి. వరదలకు దెబ్బతిన్న జిల్లాలను ఆదుకోవడానికి ప్రత్యేకంగా నిధులు వెచ్చించాలి.