ఏపీ ప్రభుత్వంలో కీలక అధికారిగా ప్రవీణ్ ప్రకాష్ చక్రం తిప్పారు. ఎంతమంది అధికారులున్నా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన మాటే ఫైనల్. రాజకీయ వ్యవహారాల్లోనూ ఆయన జోక్యం చేసుకుంటున్నారంటూ గతంలో కొందరు నేతలు గుర్రుగా ఉండేవారు. ప్రవీణ్‌ను సీఎం జగన్ పల్లెత్తు మాట అనరనే భయంతో అంతా లోలోపలే మదన పడేవారు. సీఎంవోలో అంతా తానై వ్యవహరించే ప్రవీణ్ ప్రకాష్ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రవీణ్ ప్రకాష్ హవా కొనసాగింది. ఈమధ్యనే ఆయనకు షాక్ తగిలింది. 2021 జూలై 14న ప్రవీణ్ ప్రకాష్ కు జీఏడీ పొలిటికల్ బాధ్యతల నుంచి తప్పించారు. ప్రవీణ్ ప్రకాష్ స్థానంలో సీఎం అదనపు కార్యదర్శిని జీఏడీ పొలిటికల్ సెక్రటరీగా నియమించారు. జీఏడీ సెక్రటరీ పదవి నుంచి తప్పించినా ప్రవీణ్ ప్రకాష్ ను సీఎంఓ సెక్రటరీగా కొనసాగించారు.
గతంలో ఎల్వీ సుబ్రమణ్యం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు సీఎంఓ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తర్వాత ఎల్వీ సుబ్రమణ్యం ప్రధాన కార్యదర్శి పదవి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించింది. బిజినెస్ రూల్స్ సవరిస్తూ ప్రవీణ్ ప్రకాష్ జారీ చేసిన జీవోపై ఎల్వీ సుబ్రమణ్యం షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఎల్వీ ద్వారా షోకాజ్ అందుకొన్న ప్రవీణ్ ప్రకాష్ పేరుతోనే ఎల్వీ సుబ్రమణ్యం సీఎస్ పదవి నుంచి తప్పిస్తూ బదిలీ ఉత్తర్వులు రావడం ఆ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
అప్పుడే ప్రవీణ్ ప్రకాష్ పై ఒక్కసారిగా అందరి ఫోకస్ పడింది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. సీఎం జగన్ కు ఆయనకు కాస్త గ్యాప్ పెరిగిందనే ప్రచారం కూడా ఉంది. ముఖ్యంగా ఆయన కేంద్ర పెద్దలతో టచ్ లో ఉన్నారనే వార్తలు వినిపించాయి. బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ ఓ ప్రచారం కూడా జరిగింది. అవన్నీ కేవలం రూమర్స్ గానే ఉండిపోయాయి.
ప్రస్తుతం ప్రవీణ్ ప్రకాష్ బదిలీతో ప్రభుత్వం షాక్ ఇచ్చిందని కొందరు అంటుంటే.. కాదు ఆయనే చాలాకాలంగా ఏపీ భవన్ రెసిడెంట్ అధికారిగా వెళ్లాలని కోరుకుంటున్నారంటూ మరో ప్రచారం ఉంది. ఇటీవల ప్రవీణ్ ప్రకాష్ వ్యవహారం పెను దుమారం రేపింది. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఆయన సీఎం జగన్ కాళ్ల దగ్గర మోకాలిపై కూర్చొని మాట్లాడుతున్న ఓ ఫోటో వైరల్ గా మారింది. ఓ ఉన్నత అధికారి అలా సీఎం కాళ్ల దగ్గర మోకరిల్లడం ఏంటనే దానిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ నడిచాయి. సీఎం జగన్ తనకు నచ్చని వాళ్లను ఒక్క రోజు కూడా ఆ స్థానంలో ఉంచరు. అందువల్లే ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయినట్లు తెలుస్తోంది.