నిర్మాత కోటీశ్వరుడే కావొచ్చు. వినోదాన్ని కోరుకునే ప్రేక్షకుడు సగటు మధ్యతరగతి లేదా నిరుపేద కావొచ్చు. ఆ నిర్మాత పెట్టిన రూ. కోట్ల పెట్టుబడిని రెట్టింతలు చేసి, అతడిని మరిన్ని కోట్లీశ్వరుడిని చేసేది ఆ ప్రేక్షకుడే. అందుకే ఆడియన్స్ కు మెత్తటి పూతలాంటి ప్రేక్షక దేవుళ్లు అన్న పదాన్ని కట్టబెట్టి.. ఆ పేరుతో వెన్న రాస్తుంటారు సినిమావాళ్లు.
తాజాగా హిట్ కొట్టిన డీజీ టిల్లు సినిమా నిర్మాతకు మాత్రం ప్రేక్షకుడు లోకువగానే కనిపిస్తున్నాడు. చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సినిమా వాళ్లు మేధావులని, ప్రేక్షకుడికి మాత్రం ఎంటర్టైన్ మెంట్ ఇస్తే సరిపోతుందని ఏదేదో మాట్లాడేశాడు. ముఖ్యంగా ప్రేక్షకుడిని వాడు, వీడు అంటూ తీసిపారేసే తీరులో అతడు మాట్లాడిన విధానం పట్ల ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‘‘సినిమా లెక్కలు మేథావులకు కావాలి. ప్రేక్షకుడికి అక్కర్లేదు. ఆడిచ్చే(వాడిచ్చే) 150 రూపాయలకు న్యాయం జరిగిందా లేదా అన్నదే ఆడికి(వాడికి) కావాలి. ఆ 150 రూపాయలకు ఆడిని నవ్వించేశాం’’ అంటూ డీజే టిల్లుకు సంబంధించిన ఓ ఈవెంట్ లో ఆయన మాట్లాడాడు. ఆయన మాటలు వైరల్ అయి, ఫేస్ బుక్, ట్విటర్ లలో సగటు ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వంశీకి బాబాయి అయిన ఎస్ రాధాకృష్ణ, హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ తో చాలా సినిమాలు తీశారు. ఆ బ్యానెర్ కు సిస్టర్ బ్యానరే సితార ఎంటర్టైన్మెంట్స్. సితారను వంశీ చూసుకుంటున్నారు. ఇక రాధాకృష్ణ తీసిన వాటిలో పలు బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఆయన ఎప్పుడూ నోరు జారలేదు. ఆ మాటకొస్తే అసలెప్పుడూ నోరే విప్పని నెమ్మదస్తుడు ఆయన. వంశీ మాత్రం తన బాబాయి పద్ధతికి విరుద్ధంగా ఎప్పుడూ విసుగుతో, అవసరంలేని అతితో ప్రవర్తిస్తాడని ఆయన సన్నిహితులే చెబుతున్న మాట.
‘‘అయ్యా నాగవంశీ గారూ.. గతంలో మీరు తీసిన పలు కళాఖండాలు 10 రూపాయల విలువ కూడా చేయలేదు కదా. మరి వాటికి డబ్బులు వెనక్కిచ్చేస్తారా? పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ వంటి రూ. వంద కోట్ల సినిమా చేతిలో ఉంది కదా అని ప్రేక్షకుల్ని తక్కువ చేసి మాట్లాడకండి. 50, 60 సినిమాలు చేసిన నిర్మాతలు కూడా మీలా ఎప్పుడూ మాట్లాడలేదు’’ అంటూ నెట్టింట జనాలు మండిపడుతున్నారు. మరి ఇకనైనా నిర్మాత గారు ఆడియన్స్ కు కొంచెం గౌరవం ఇచ్చి మాట్లాడతారేమో చూడాలి.