విశాఖ ఉక్కు పరిరక్షణకు కార్మిక సంఘాల పోరు కొత్త రూపు తీసుకుంది.
ఇప్పటిదాకా ధర్నాలు.. రాస్తారోకోలు.. హర్తాళ్‌తో నిరసన వ్యక్తం చేశారు.
ఏంచేసినా సరే. తాము తగ్గేదేలే అంటూ కేంద్రం స్పష్టం చేసింది.
ఈరోజు నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఫోన్లకు ‘స్టాప్ ది సేల్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్’ మెస్సేజ్ పంపిస్తున్నారు.
కేవలం కార్మికులే కాదు.
వాళ్ల కుటుంబాలతోపాటు ప్రభుత్వ రంగంలోనే విశాఖ స్టీల్ ప్లాంటు ఉండాలనుకునే వాళ్లంతా మంత్రులకు మెస్సేజ్‌లు పెడుతున్నారు.
మంత్రులకు మెయిల్స్ కూడా పంపుతున్నారు.
కేంద్ర సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించాలనేది తమ విధానమని చెప్పుకుంటోంది.
దీనికి రాజకీయంగా సెగ తగిలితే తప్ప కేంద్రం వెనకడుగు వేయలేదు.
స్టీల్ ప్లాంటు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామనే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, మిత్ర పక్షం జనసేన బీజేపీని నిలదీయలేని బేలతనం ప్రదర్శిస్తున్నాయి.
ముందుగా ఆయా పార్టీలకు కార్మికుల నిరసన సెగ తగలకుంటే స్టీల్ ప్లాంటు విక్రయం ఆగదు.
ఇది కేవలం కార్మికుల సమస్య మాత్రమే కాదు.
ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు పెను సవాల్ విసురుతున్న అంశం.
అందువల్ల రాష్ట్రంలోని ప్రతీ కుటుంబాన్ని కదిలించేట్లు కార్మిక ఐక్య పోరు కొనసాగాలి.
ఇదొక ప్రజా పోరాటంగా ఎదగాలి.
రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలను నిలదీసేట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం ముందుకెళ్లాలి.
ఇప్పటిదాకా రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు పైపై ప్రకటనలతో సరిపెట్టే ఎత్తుగడను అనుసరించాయి.
కేంద్రాన్ని గట్టిగా నిగ్గదీసిన సందర్భాల్లేవు.
ఇప్పుడు కార్మిక సంఘాలు చేపట్టిన మెస్సేజ్‌లు పంపడంతోనే అంతగా ప్రభావం చూపకపోవచ్చు.
కేవలం కేంద్ర మంత్రులకే కాదు.
రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు… ప్రధాన పక్ష నేతలకూ చురుకు తగిలేట్లుండాలి.
విశాఖ స్టీల్ ప్లాంటు రక్షణకు కదలకుంటే తమ రాజకీయ భవిష్యత్తు లేదనేట్లుండాలి.
రాజకీయంగా భూస్థాపితమవుతామనే వణుకు పుట్టించాలి. ఆ దిశగా ప్రజా ఉద్యమం లేవాలి.
ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేసినా.. వెనక్కి తగ్గినా బీజేపీకి కొత్తగా ఊడేది లేదు. పోయేది లేదు.
అందువల్ల తమ నిర్ణయం నుంచి వెనక్కి అడుగేసే అవకాశం లేదు. బీజేపీకి సహకరిస్తున్న పార్టీల ఉనికిని ప్రశ్నించేట్లు పరిరక్షణ ఉద్యమం కొనసాగాలి.
రాజకీయంగా ఆయా పార్టీలకు నష్టం జరుగుతుందన్న అంచనాకు రాకుంటే ఇలా పైపై ప్రకటనలకే పరిమితమవుతాయి.
ఆ పక్షాల పునాదులు కదిలేట్లు విశాఖ ఉక్కు ఉద్యమం లేవాల్సిన ఆవశ్యకత ఉంది.
ఆ దిశగా ప్రజా పోరాటానికి నాంది పలకాలి.