శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః అని చెబుతారు. అంటే సంగీతంతో ప్రకృతినే పరవశింపజేయచ్చు అని అర్థం. ఆ గాయని మాత్రం తన గానంతో సొంత ఊరికి ఆర్టీసీ బస్సు వచ్చేలా చేయగలిగింది. ఏదైనా కోరుకో ఇస్తామంటే.. మా ఊరికి బస్సు వేస్తే చాలు సార్ అంటూ వినమ్రంగా కోరింది. జీ సరిగమపలో గాయనిగా అదరగొట్టి.. సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన పార్వతి కథ ఇది.
కర్నూలు జిల్లాలోని లక్కసాగరం గ్రామానికి చెందిన పార్వతిని నిరుపేద కుటుంబ నేపథ్యం. తనకు ఇద్దరు అన్నయ్యలు, ఒక అక్క ఉన్నారు. కుటుంబంలోని ఆడవాళ్లతో సహా అందరూ కూలిపనులు చేస్తేగానీ డొక్కాడదు. లక్ష్యం నిర్దేశించుకునేందుకు ఆర్థిక పరిస్థితి అడ్డుకాదు కదా. సంగీతమంటే చిన్ననాటి నుంచీ ప్రాణం కావడంతో పెదనాన్న సాయంతో తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంగీత నృత్యకళాశాల డిప్లోమాలో చేరింది.
ఈ క్రమంలోనే టీటీడీకి సంబంధించి అదివో అల్లదివో కార్యక్రమంలో పాడేందుకు ఆమెకు అవకాశం లభించింది. ఇక ఆ తర్వాత జీ తెలుగులో సరిగమప కార్యక్రమంలో చాన్స్ దక్కింది. ఇదే ఆమె జీవితానికి, లక్కసాగరం గ్రామానికి టర్నింగ్ పాయింట్ గా మారింది.
కార్యక్రమంలో ఊరంతా వెన్నెల, మనసంతా చీకటి అన్న పాటతో అటు జడ్జిలను, ఇటు శ్రోతలను కట్టిపడేసింది. ఆ షోలో జడ్జిగా ఉన్న సంగీత దర్శకుడు కోటి ఆమెకు ఏం కావాలో కోరుకోమంటే.. మా ఊరికి బస్సు వేయిస్తే చాలని అడిగింది. బస్సు వేయించే శక్తి కార్యక్రమ జడ్జిలకు లేకపోయినా.. ఆమె సంకల్పానికి మాత్రం ఆ శక్తి ఉన్నట్లుంది. సోషల్ మీడియాలో ఆమె పాటకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారి ఐదు లక్షల మందికి పైగా చూశారు.
అది కాస్తా ఏపీ రవాణా మంత్రి వరకూ చేరడం చకచకా జరిగిపోయాయి. ఆయన ఆర్టీసీ అధికారులతో మాట్లాడి వెంటనే ఆ ఊరికి బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. సంకల్ప శక్తి ఉంటే ఆకాశం నుంచి గంగను తేవచ్చు. ప్రభుత్వాన్ని కదిలించి మారుమూల ఊరికి ఆర్టీసీ బస్సును రప్పించవచ్చు. అందుకు పంచభూతాలు, సోషల్ మీడియా సహా అన్నీ సహకరిస్తాయి. అందుకు ఈ ఘటన కంటే నిదర్శనమేముంది ?