ఒకప్పుడు వరస బ్లాక్ బస్టర్లతో కలెక్షన్ కింగ్ అని బిరుదును తెచ్చుకున్నారు మోహన్ బాబు. నటన పరంగా, సంభాషణల్ని పలికే విధానంలో ఆయనకు ఆయనే సాటి. గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరమవడం ఆయన ఇమేజ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దానికి తోడు అవసరం లేని వివాదాస్పద వ్యాఖ్యలు, మంచు వారి సినిమాలకు శాపాలుగా మారుతున్నాయి. తాజాగా విడుదలైన ఆయన సన్నాఫ్ ఇండియా ప్రదర్శన వసూళ్లు నిరాశపర్చాయి.
ఈ నెల 18న సన్నాఫ్ ఇండియాను దేశవ్యాప్తంగా 350 థియేటర్లలో విడుదల చేశారు. తొలిరోజు కలెక్షన్ ఎంతో తెలుసా..? రూ. 6 లక్షలు. అది కూడా నెట్ కాదు. గ్రాస్ కలెక్షన్. మోహన్ బాబు అంటే ఏదో చిన్న స్టార్ కాదు. ఆయనకంటూ తిరుగులేని రికార్డులున్నాయి. ఒక లెగసీ ఉంది. అలాంటి వ్యక్తికి ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం పట్ల ట్రేడ్ పండితులు ఆశ్చర్యపోతున్నారు. ఎంత చిన్న బడ్జెట్ సినిమాలైనా కూడా ఇంతకంటే బాగానే కలెక్ట్ చేస్తాయిగా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మా ఎన్నికల సమయం నుంచీ మోహన్ బాబు కుటుంబం వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా అటు మోహన్ బాబు, ఇటు మంచు విష్ణు కూడా ట్రోలింగ్ కు గురవుతున్నారు. తాజాగా టికెట్ రేట్ల విషయంలో మరోసారి మంచు కుటుంబం వైఖరిని నెటిజన్లు ట్రోల్ చేశారు. దీంతో సన్నాఫ్ ఇండియాకు నెగెటివ్ బజ్ ఎక్కువై.. థియేటర్లు పూర్తిగా ఖాళీగా కనిపించాయి. తొలిరోజు వచ్చిన స్పందన మేరకు చాలా థియేటర్ల నుంచి సినిమాను తీసేయాలని నిర్మాత మంచు విష్ణు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పలు చోట్ల జనాలు లేక షోలు క్యాన్సిల్ అవడం గమనార్హం.
ఇప్పటికే రూ. 100 కోట్ల బడ్జెట్ గా చెప్పుకొన్న మోసగాళ్లు సినిమా విష్ణుకు భారీ నష్టాలను మిగిల్చింది. ఇప్పుడు సన్నాఫ్ ఇండియా ఫలితం ఆయనకు మరింత దెబ్బకొట్టిందనే చెప్పుకోవాలి. అటు సమీక్షల్లోనూ పూర్తి నెగటివ్ గానే రాస్తున్నారు. ఎంచుకున్న అంశం మంచిదే అయినా దాన్ని సమర్థంగా తెరకెక్కించడంలో డైమండ్ రత్నబాబు విఫలమయ్యారని.. సినిమా నిర్మాణపు విలువలు మరీ నాసిరకంగా ఉన్నాయని, సినిమా నిడివి కేవలం గంటన్నర ఉండటంతో సినిమాకు వెళ్లడం అనవసరమని రివ్యూయర్లు రాసుకొస్తున్నారు.
మోహన్ బాబు ఆరోపిస్తున్నట్లు ఇద్దరు హీరోలే ఇదంతా చేయిస్తున్నారా.. లేక ఇది వారి స్వయంకృతాపరాధమా అన్నది మంచు కుటుంబం ఒకసారి సరిచూసుకోవాలనేది విశ్లేషకుల మాట. ట్రోల్ చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తామని మోహన్ బాబు కుటుంబం హెచ్చరించింది. మొత్తంగా ఒక పెద్ద హీరోకు మునుపెన్నడూ లేని స్థాయిలో ఈ సినిమా డిజాస్టర్ అయి, మోహన్ బాబుకు తీరని అవమానాన్ని మిగిల్చింది. మున్ముందు మంచి కథనాలతో మోహన్ బాబు తెరమీదకు రావాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.