కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై నిప్పులు చెరుగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత దూకుడు పెంచారు. ప్రాంతీయ పార్టీలను సమీకరించే కార్యాచరణలో తొలి అడుగు వేశారు. ఆదివారం కేసీఆర్ ముంబైకి వెళ్తున్నారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఆహ్వానం మేరకు ఆయనను కలుస్తారు. కేసీఆర్, ఉద్దవ్ భేటీతో దేశ వ్యాప్తంగా ప్రాంతీయ కూటమి చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ మోడీ ప్రభుత్వాన్ని సరిగా నిలువరించ లేకపోతుంది. అందుకే ప్రాంతీయ కూటమి అవసరం ఉందని సీఎం కేసీఆర్ చెబుతున్నారు. దీంతో ఆయన బీజేపీ, కాంగ్రెస్ లేకుండా కొత్త కూటమి ఏర్పాటు చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది.
కేసీఆర్ కూటమి విజయవంతమవుతుందా! కూటమి బలం, బలహీనతలు ఏమిటి అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముందుగా కూటమి ఏర్పాటు చేస్తున్న నాయకులు ఆయా ప్రాంతాల్లో బలమైన నాయకులే. స్టాలిన్, కేసీఆర్, మమతా బెనర్జీ, శరద్ పవార్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపగలరు. కష్ట పడితే మంచి సీట్లు సాధించగలరు. అయితే కూటమి బలహీనత ఉమ్మడి నాయకుడు ఎవరన్నదే. అందరూ ప్రధాని అభ్యర్థులే కావడం.. ఉమ్మడి నాయకుడిని ఎన్నుకోవడం కష్టమని భావిస్తున్నారు.
అందరూ కూటమిగా ఏర్పడి అభ్యర్థి పెట్టినా.. రాహుల్ గాంధీ మాత్రమే 2014 నుంచి మోడీని పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రచారం చేశారు. ఇతర ప్రాంతీయ నాయకులు ఎవ్వరూ ఏదో ఓ సందర్భంలో మోడీతో అనుకూలంగా వ్యవహరించిన వారే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకే దక్కని ఇమేజ్ ప్రాంతీయ కూటమి సభ్యులకు దక్కుతుందా అనేది ప్రశ్న.
మరోవైపు వామపక్ష పార్టీల దారి ఏంటన్నది తెలియడం లేదు. కేసీఆర్ తో లెఫ్ట్ నేతలు టచ్ లో ఉన్నా ఎంతవరకు కొనసాగిస్తారన్నది అనుమానమే. కేసీఆర్ కూటమిలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలకంగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. అదే కామ్రేడ్లకు ఇబ్బందికరం. బెంగాల్ లో తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న మమత నాయకత్వంలోని కూటమిలో కొనసాగకూడదని వామపక్ష నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ తో సీపీఎం అగ్రనేతలు సమావేశమయ్యారు. ఆ భేటీలో కొత్త కూటమిపై చర్చ జరిగిందని తెలుస్తోంది. తర్వాత ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో కేసీఆర్ కూటమిపై ప్రయత్నాలపై లెఫ్ట్ నేతలు చర్చించారట. అయితే మమత కీలకంగా ఉన్న కూటమిలో చేరవద్దని మెజార్టీ వామపక్ష నేతలు చెప్పారని సమాచారం. దీంతో కేసీఆర్ కూటమిలో కామ్రేడ్లు చేరకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అంతేకాదు బీజేపీ మిత్రపక్షాలతో కాకుండా కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలతోనే కేసీఆర్ చర్చలు జరపడాన్ని వామపక్ష నేతలు తప్పుపడుతున్నారు. ఇది బీజేపీకి ప్రయోజనం చేకూర్చేలా ఉందని కొందరు లెఫ్ట్ నేతలు అంటున్నారు. మొత్తంగా కేసీఆర్ కూటమికి కామ్రేడ్లు హ్యాండ్ ఇస్తారా లేక కలుస్తారా అనేది స్పష్టం కాలేదు.