కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల సమయంలోనే కలలుకన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేద్దామనుకున్నారు. అది విఫలమైంది. తాజాగా మరోసారి కేంద్రానికి వ్యతిరేకంగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అవుతున్నారు. ఒక ఐక్యతను సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇవన్నీ అలా ఉంచితే..
ఈ మొత్తం వ్యవహారంలో నటుడు ప్రకాశ్ రాజ్ పాత్ర ఏమిటన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ బృందం ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలిసేందుకు ముంబై వెళ్లారు. వారిని ముంబై ఎయిర్ పోర్టులో స్వయంగా ప్రకాశ్ రాజ్ రిసీవ్ చేసుకోవడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
మరింత ఆసక్తిని రేపుతూ కేసీఆర్ తోపాటు ఉద్ధవ్ తో భేటీకి ప్రకాశ్ రాజ్ కూడా వచ్చారు. పైపెచ్చు తన మేనల్లుడు ఎంపీ సంతోష్, కూతురు కవితతో సమానంగా ప్రకాశ్ కు గౌరవం అందేలా కేసీఆర్ చూశారు.
కేసీఆర్ కు, ప్రకాశ్ రాజ్ కు కామన్ పాయింట్ బీజేపీ వ్యతిరేకత. ప్రకాశ్ రాజ్ ఎప్పటికప్పుడు బీజేపీ తప్పుల్ని ఎంచడం, ట్విటర్ వేదికగా ఆ పార్టీని ఎండగట్టడం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ చాలా మంది చేసేవే.
2019 ఎన్నికల్లో ప్రకాశ్ బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర ఎంపీగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఇటీవల మా ఎన్నికల్లోనూ గెలవలేకపోయారు. అయినా కేసీఆర్ ప్రకాశ్ రాజ్ కు ఎందుకు అంతలా ప్రాముఖ్యతనిస్తున్నారన్నదే ఇక్కడ అసలు ప్రశ్న.
లోతుగా వెళ్తే.. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలను ఏకం చేయడంలో ప్రకాశ్ రాజ్ తెర వెనుక కీలక భూమిక పాటిస్తున్నారని అంతర్గత వర్గాల సమాచారం. ఆయన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ప్రజలకు బాగా తెలిసిన నటుడు. అటు హిందీలోనూ అనేక చిత్రాల్లో నటించారు. ఈ క్రమంలో.. తన పాపులారిటీతో నాన్ బీజేపీ సీఎంలు అందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రకాశ్ కృషి చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
గతంలో ఫెడరల్ ఫ్రంట్ కోసం కర్ణాటకలోని జేడీఎస్ పార్టీ అధినేతలు మాజీ పీఎం దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామిని కేసీఆర్ కలిసినప్పుడూ ప్రకాశ్ రాజ్ ఉండటం గమనార్హం. తాజా కూటమి ఏర్పాటు ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తే.. మున్ముందు ప్రకాశ్ రాజ్ ను టీఆర్ఎస్ ఎంపీగా చూడాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.