” పెద్దాయనా ! కూలి ఎంతొస్తోంది !”
తలెత్తి చూశాడు.
మారుమాట్లాడకుండా మళ్లీ పనిలో నిమగ్నమయ్యాడు.
ఆ విలేకరికి ఏం పాలుపోలేదు.
మళ్లీ అడిగాడు.
ముళ్ల చెట్లు తొలగించడం ఆపి ఆ దంపతులు దగ్గరకొచ్చారు.
”అయ్యా ! పొద్దుపొడవక ముందొచ్చాం.
ఇంకో రెండు గంటలు మించి చెయ్యలేం !
150 రూపాయలు వస్తాయని చెబుతున్నారయ్యా!”
అంటూ పెదవిరిచాడు.
” అదేంటి ! ఒక్కో కూలీకి రూ.300 గిట్టుబాటవుతుందని
అధికారులు చెబుతున్నారు !”
అంటూ విలేకరి చెబుతుండగానే..
” ఈ భూమి చూడండి ! బండ రాయిలా ఉంది.
దీన్ని తవ్వడానికి ఎంత శక్తి కావాలో లెక్కేయండి !
పనిని కాదు కొలవాల్సింది.. మా శక్తిని కొలవండి!
దాని ప్రకారం డబ్బులియ్యమనండయ్యా!” అంటూ పెద్దాయన రెట్టించాడు.
” మీ బైక్‌లో ఎంత పెట్రోలు పోస్తే.. అంతవరకే పోయి ఆగిపోద్ది !
మనిషి ఒంట్లో శక్తి అలా కాదు బాబూ!
ఏ పనికైనా వినియోగించే శక్తికి సమానంగా కూలిచ్చే వాళ్లు ఎక్కడున్నారయ్యా !’’
పెద్దాయన మాటల దెబ్బకు విలేకరికి దిమ్మ తిరిగింది.
“ఈ మధ్యన ఉద్యోగులందరికీ జీతాలు కోసేసారట గదా !
ఏవోలే బాబూ ! మా కూలి డబ్బులకు కోతెయ్యలేదు. సంతోషమయ్యా !
అంటూ ముసలాయన చిరునవ్వేశాడు.
ఆ పెద్దాయన సంతోషంగా చెప్పాడా.. విరక్తితో అన్నాడా..
అర్థంగాక ఆ విలేకరి బుర్ర గీక్కుంటూ అక్కడ నుంచి కదిలాడు.
– ఓ అనుభవానికి కథా రూపం.