ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందారు. ఈరోజు ఉదయం ఆయనకు గుండెపోటు రాగా హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆసుపత్రికి వచ్చే సమయానికే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆయనను కాపాడేందుకు వైద్యులు అన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. గౌతమ్‌రెడ్డి మరణించిన విషయాన్ని అపోలో వైద్యులు ఆయన భార్యకు సమాచారం అందించారు.
వారం రోజుల పాటు దుబాయ్ పర్యటనను ముగించుకుని ఆదివారం ఆయన హైదరాబాదు వచ్చారు. దుబాయ్ ఎక్స్ పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా పలు సంస్థలతో సంప్రదింపులు జరిపి, కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు.
1971, నవంబర్ 2న గౌతమ్ రెడ్డి జన్మించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడే మేకపాటి గౌతమ్ రెడ్డి.
గౌతమ్ రెడ్డి మరణంతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వైసీపీ శ్రేణులు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఆయన మృతి పట్ల పార్టీలకు అతీతంగా అందరూ దిగ్భ్రాంతికి గురవుతున్నారు. 49 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన మరణించడం అందరిలో విషాదాన్ని నింపుతోంది.
మేకపాటి గౌతం రెడ్డి ఏదైనా విషయాన్ని వెల్లడించడంలో సూటితనం ఉంటుంది. ఎన్నడూ ఎవరిపైన అనుచిత వ్యాఖ్యలు చేసింది లేదు. చాలా హుందాగా మాట్లాడేవారు. అది విమర్శయినా మెచ్చుకోలయినా. రాజకీయ నాయకుండంటే ఇలా ఉండాలనుకుంటారు ఎవరైనా. రాజకీయాల్లో ఉన్నత స్థాయికెదాగాల్సిన పిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.